ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 19, 2020 , 02:59:53

భూసార కార్డుల పంపిణీ

భూసార కార్డుల పంపిణీ

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలోని ఆదర్శ గ్రామాల్లో బుధవారం భూసార కార్డులను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూసార పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 72 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో వ్యవసాయశాఖ నిర్వహించిన భూసార పరీక్షల్లో భూమి స్వభావం లక్షణాలను రైతులకు వివరిస్తూ నివారణ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, ముథోల్‌ వ్యవసాయ సబ్‌డివిజన్లు ఉండగా.. మొత్తం 19 మండలాలు, 396 గ్రామాలు ఉన్నాయి. 72 వ్యవసాయక్లస్టర్ల పరిధిలో ఒక్కో మండలంలో ఇప్పటికే వ్యవసాయశాఖ ఒక్కో గ్రామాన్ని భూసార పరిరక్షణ కోసం పైలట్‌ గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడ అన్ని రకాల భూములకు పరీక్షలు నిర్వహించి భూసార పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే జిల్లాలోని ఏఈవోల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార కిట్ల ద్వారా  వందశాతం భూముల భూసార పరీక్షలను నిర్వహించారు. భూముల్లో భూసారం లోపించడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నివారణ పద్ధతులపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించనున్నారు. 

అవగాహనతోనే పంటల పెరుగుదల...

జిల్లాలో 70శాతం రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడిజీవిస్తున్న నేపథ్యంలో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత ఏర్పడుతున్నది. రైతులు తమ భూముల్లో వివిధ పంటలను సాగు చేసుకుంటున్నప్పటికీ భూముల్లో లోపాలను గుర్తించకుండా రసాయన ఎరువులను పరిమితికి మించి వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. జిల్లాలోని నల్లరేగడి, ఇసుక దిబ్బ, ఎర్రరేగడి, చలిదుబ్బ భూములు ఉన్నాయి. ఈభూముల్లో కావాల్సినంత నత్రజని, పోటాషియం, సూక్ష్మధాతువుల పోషకాలు ఉన్నప్పుడే రైతులు వేసుకున్న పంటు ఎదిగి అధిక దిగుబడులు సాధించవచ్చు. కొన్నేండ్లుగా రైతులు రసాయన ఎరువులను అతిగా వాడకం, వర్షాలతో వరద నీటితో భూముల్లోని సారం కొట్టుకపోవడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నది.

వీటన్నింటినీ అధిగమించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రతి రైతుకు భూసార పరీక్షలు చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా జిల్లవ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, విస్తీర్ణ అధికారులు ఆయా రైతులకు సంబంధించిన భూముల స్వభావాన్ని రైతులకు వివరించి ఏ ధాతువులు లోపంగా ఉన్నాయో వాటి నివారణ పద్ధతులను వివరిస్తారు. రసాయన ఎరువులతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన భూసార కార్డులను అందిస్తారు. ఇప్పటికే జిల్లాలోని 19 పైలట్‌ గ్రామాల్లో 15వేల మంది రైతులకు భూసార కార్డులను అందించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి కోటేశ్వర్‌రావు తెలిపారు. 


logo