మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 19, 2020 , 02:59:53

తాంసి-గొల్లఘడ్‌ అడవుల్లో పులి సంరక్షణ చర్యలు

తాంసి-గొల్లఘడ్‌ అడవుల్లో పులి సంరక్షణ చర్యలు

భీంపూర్‌:  గ్రామ శివార్లలో పెద్ద పులుల సంచారం, పశువులపై వరుస దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అటవీశాఖ అప్రమత్తమైంది. భీంపూర్‌ మండలం పెన్‌గంగ పరివాహక  పాంత్రాలైన తాంసి(కే), గొల్లఘడ్‌ అటవీప్రాంతాల్లో ప్రజల భద్రతతోపాటు పులుల సంరక్షణ చర్యలు చేపట్టారు. జన్నారం సహా ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి రెస్క్యూ  టీం రంగంలోకి దిగింది. రెస్క్యూ బృందాలు వన్య ప్రాణుల సంరక్షణ వాహనాలతో మంగళవారం తాంసి (కే) గ్రామానికి చేరుకున్నాయి. ఎఫ్‌ఆర్వో అప్పయ్య, డీఎఫ్‌ ఆర్వోలు గీరయ్య, రణవీర్‌, గులాబ్‌సింగ్‌, కేశవ్‌తోపాటు 30 మంది  సిబ్బంది ప్రస్తుతం అక్కడే మకాం వేసి ఉన్నారు. ఎఫ్‌డీవో ప్రభాకర్‌  క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక సర్పంచ్‌ కరీం, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, గ్రామస్తులు అధికారులకు సహకరిస్తున్నారు. 

వాచ్‌ టవర్స్‌, కంట్రోల్‌రూం..

అడవి ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు ప్రజలు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో హెచ్చరికగా రిబ్బన్లు ఏర్పాటు చేశారు. పులి కదలికలు గమనించడానికి వాచ్‌ టవర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో, క్యాప్చరింగ్‌, ట్రాపింగ్‌  కొనసాగుతున్నది.  బేస్‌ క్యాంపులు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బంది పని చేస్తున్నారు. మొన్న తాంసి(కే) పాఠశాల వెనుక ఉన్న పొదల్లో, పెన్‌గంగలో నీరు తాగుతూ కనిపించిన పెద్దపులి ఆ తరువాత సోమవారం ఉదయం రెండు పశువులపై దాడికి ప్రయత్నించగా అవి తప్పించుకున్నాయి. ఆ తరువాత  పులి కనిపించలేదు.  ఏ సమయంలోనైనా గ్రామంలోకి పులి రావచ్చని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతంలో రెండు  పులులు  ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పులులను మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బోనులో అభయారణ్యానికి సురక్షితంగా చేర్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  


logo
>>>>>>