శనివారం 28 మార్చి 2020
Nirmal - Feb 17, 2020 , 03:03:13

హరిత కానుక

హరిత కానుక

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ పుట్టినరోజున సోమవారం మొక్కల పండగ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రతి ప్రభుత్వశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రెండు చొప్పున మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నారు. మరోవైపు ఆయా ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచేందుకు నిర్ణయించారు. ప్రభుత్వశాఖలకు, ఉద్యోగులకు అవసరమైన మొక్కలను అటవీ, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, అధికారులు, ఉద్యోగులకు అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి ఇవ్వాలని అటవీ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఇప్పటికే తమ సిబ్బందిని ఆదేశించారు. పూలమొక్కలు, పండ్ల మొక్కలు ప్రత్యేకంగా తెచ్చుకొని పెట్టుకునేందుకు కొన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకున్నారు. 


జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు.. నర్సాపూర్‌ (జి)లోని మొక్కలు నాటనున్నారు. ఎస్పీ సి.శశిధర్‌రాజు నర్సాపూర్‌ (జి) పోలీస్‌ష్టేషన్‌తో పాటు క్యాంపు ఆఫీసులో మొక్కలు నాటనున్నారు. పోలీసుశాఖ పరిధిలో 1200 మంది ఉద్యోగులు ఉండగా.. చెరో ఒక్కో మొక్క చొప్పున నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటున్నారు. హోంగార్డు నుంచి ఎస్పీ వరకు అందరూ మొక్కలు నాటి సంరక్షించేలా ముందుకెళ్తున్నారు. సారంగాపూర్‌ మండలం చించోలి(బి) వద్ద ఉన్న సివిల్‌ సప్లయ్‌ గోదాం వద్ద అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు మొక్కలు నాటుతున్నారు. జిల్లాలోని 420 మంది రేషన్‌ డీలర్లు చెరో నాలుగు మొక్కల చొప్పున నాటేలా  ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో 1500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. గ్రంథాలయం, చించోలి(బి)తో పాటు గతంలో పెట్టిన మొక్కలు చనిపోయిన ప్రదేశాల్లో మళ్లీ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అన్నిశాఖల ఆధ్వర్యంలో ప్రతి ఉద్యోగి రెండు చొప్పున మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. 


టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో..

సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే మూడు వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించారు. మున్సిపాలిటీతో పాటు భాగ్యనగర్‌, అయ్యప్ప దేవాలయం వద్ద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గంలోని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఇందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేశారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా హరిత పండగ నిర్వహణకు సిద్ధమయ్యారు. logo