శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 17, 2020 , 02:58:24

15 సంఘాలపై గులాబీ జెండా

15 సంఘాలపై గులాబీ జెండా

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సహకార ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. తాజాగా సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులే గెలుపొందారు. జిల్లాలో 17సహకార సంఘాలుండగా.. వీటిలో 16పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఉంది. కుభీర్‌, కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్‌ మండలంలోని ముఠాపూర్‌, మంజులాపూర్‌, సారంగాపూర్‌ మండలం ఆలూరు, కౌట్ల, ముథోల్‌ మండలంలోని బిద్రెల్లి, తానూరు మండలంలోని హంగిర్గా, దిలావర్‌పూర్‌ మండలంలోని బన్సపెల్లి, ఖానాపూర్‌ మండలం సత్తన్నపల్లి, ఖానాపూర్‌, కడెం మండలం పాండ్వాపూర్‌, భైంసా మండలం మిర్జాపూర్‌లోని సహకార సంఘాలుండగా.. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం ఉంది. 17సంఘాల పరిధిలో 221టీసీలుండగా.. 99టీసీలు ఏకగ్రీవంకాగా.. 122టీసీలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఒక్క లక్ష్మణచాంద పీఏసీఎస్‌ పరిధిలో అన్ని టీసీలు ఏకగ్రీవంకాగా.. మిగతా చోట్ల కొన్ని టీసీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో 174టీసీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకోగా.. 41చోట్ల కాంగ్రెస్‌, ఒక చోట బీజేపీ, అయిదు చోట్ల ఇతరులు గెలుపొందారు. ఆదివారం పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. 


రెండు చోట్ల వాయిదా

జిల్లాలోని 17సహకార సంఘాలకుగాను.. 15చోట్ల కోరం ఉండడంతో ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మరో రెండు చోట్ల.. కుంటాల, భైంసా మండలం మిర్జాపూర్‌ పీఏసీఎస్‌లలో కోరం లేకపోవడంతో.. ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 14పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఎస్‌సీఎస్‌లలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించగా.. అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మద్దతుదారులే పదవులను దక్కించుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారులు ఒక్క చోట కూడా పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోలేదు. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలు కనీసం బోణీ కూడా కొట్టలేదు. 15సహకార సంఘాల్లో.. 11చోట్ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఒక్కొక్కరే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మిగతా నాలుగు చోట్ల మాత్రం ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు రావడంతో.. ఎన్నికలు నిర్వహించారు. 15చోట్ల కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే విజయం సాధించారు. తానూర్‌ మండలం హంగిర్గా, ఖానాపూర్‌ మండలం సత్తెనపల్లి, ఖానాపూర్‌, కడెం మండలం పాండ్వాపూర్‌లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. 


ఊరిపి పీల్చుకున్న అధికార యంత్రాంగం

నిర్మల్‌ నియోజకవర్గంలో ఏడు పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఉండగా.. అన్ని చోట్ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే దక్కాయి. ముథోల్‌ నియోజకవర్గంలో ఆరు పీఏసీఎస్‌లు ఉండగా.. రెండు చోట్ల కోరం లేక వాయిదా పడింది. కోరం ఉన్న మిగతా నాలుగు పీఏసీఎస్‌లకు.. ఒక్క తానూర్‌ మండలం హంగిర్గా మినహా.. మూడు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. నాలుగు పీఏసీఎస్‌లు కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే దక్కాయి. ఖానాపూర్‌ నియోజకవర్గంలో మూడు పీఏసీఎస్‌లు ఉండగా.. మూడు చోట్ల ఒక్కటి కంటే ఎక్కువ నామినేషన్లు రావటంతో.. ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఈ మూడింటిని కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుచుకున్నారు. కోరం లేక వాయిదా పడిన రెండు చోట్ల నేడు ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే మెజారిటీ సభ్యులు ఉన్నాయి. దీంతో ఇవి కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనున్నాయి. మొత్తానికి అన్ని నియోజకవర్గాల్లో.. అన్ని పీఏసీఎస్‌లు గులాబీ ఖాతాలో పడుతుండగా.. జిల్లాను టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారని చెప్పవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.


logo