శనివారం 30 మే 2020
Nirmal - Feb 15, 2020 , 01:54:31

‘సహకార’ పోలింగ్‌ నేడే

‘సహకార’ పోలింగ్‌ నేడే
  • ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌
  • రేపటి నుంచి మూడు రోజుల్లోపు చైర్మన్ల ఎన్నిక
  • 122 టీసీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు
  • పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది, సామగ్రి
  • మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సహకార ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాటు పూర్తిచేశారు. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. జిల్లాలో 16 పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఉంది. ఈ 17 సంఘాల పరిధిలో 221టీసీలు ఉన్నాయి. వీటిలో 99టీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 122టీసీలకు నేడు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. లక్ష్మణచాంద పీఏసీఎస్‌ పరిధిలోని 13టీసీలు ఏకగ్రీవం కావడంతో ఇక్కడ పీఏసీఎస్‌ పూర్తిగా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. దీంతో ఇక్కడ ఎన్నికలు లేవు. 16 పీఏసీఎస్‌ పరిధిలోని 122 టీసీలకు పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 278మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారం రోజులుగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించగా.. అదృష్టం ఎవరిని వరించనుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కుభీర్‌ పీఏసీఎస్‌లో ఒక్క టీసీ కూడా ఏకగ్రీవం కాకపోగా, అన్ని టీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 30మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగతా 14పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఎసీఎస్‌లో కొన్ని టీసీలు ఏకగ్రీవం  కాగా మిగతా వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. 


నిర్ణీత సమయంలోపు వచ్చిన వారికే ఓటు

నిర్ణీత సమయంలోపు లోపలికి వచ్చిన వారికే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. తొలిరోజున ఏడుగురు మంది డైరెక్టర్లు ఉంటేనే కోరం ఉన్నట్లు భావిస్తారు. ఏడుగురి కన్నా తక్కువగా డైరెక్టర్లు సమావేశానికి వస్తే ఆరోజు వాయిదా వేసి మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. మరుసటి రోజు కోరం లేకున్నా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. మరోవైపు వారం రోజులుగా హోరాహోరీగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. చివరి రోజైన శుక్రవారం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మద్యం, మాంసం, డబ్బులు బహుమతుల రూపంలో ఇచ్చి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఒక్కో టీసీలో 150 నుంచి 250మంది ఓటర్లుండగా ఇంటింటికీ వెళ్లి వారిని తమకు అనుకులంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేశారు.


అభ్యర్థుల్లో ఉత్కంఠ

మరి కొద్దిసేపట్లో పోలింగ్‌ ప్రారంభమవుతుండగా, మరికొద్ది గంటల్లో ఫలితాలు కూడా రానున్నాయి. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలిచేదెవరో.. ఓడెదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే లక్ష్మణచాందతో పాటు మరో 7 పీఏసీఎస్‌లలో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉండడంతో 8 పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడినట్లే. మిగతా ఏకగ్రీవమైన టీసీల్లోనూ 95శాతంపైగా టీసీలు టీఆర్‌ఎస్‌కే దక్కాయి.logo