శనివారం 29 ఫిబ్రవరి 2020
సిరులు కురిపిస్తున్న ‘తెల్ల బంగారం’

సిరులు కురిపిస్తున్న ‘తెల్ల బంగారం’

Feb 14, 2020 , 00:04:52
PRINT
సిరులు కురిపిస్తున్న  ‘తెల్ల బంగారం’

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో ఈ ఏడాది 67వేల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. హెక్టారుకు 20క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేసి, 12లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావించారు. ఇప్పటి వరకు 7,47,297క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. మరో 1.5లక్షల నుంచి 2లక్షల క్వింటాళ్ల వరకు పత్తి నిల్వలు రైతుల వద్ద ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 9లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐదు చోట్ల.. 21జిన్నింగుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి పంట కొనుగోళ్లు చేస్తున్నారు. నిర్మల్‌, భైంసా, కుభీర్‌, ఖానాపూర్‌, సారంగాపూర్‌లోని 21జిన్నింగులు, మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌ నెలలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించగా.. ప్రస్తుతం జోరుగా పత్తి కొనుగోళ్లు సాగుతున్నాయి.

జిల్లాలో ఇప్పటి వరకు 7,47,297క్వింటాళ్ల పత్తిని రైతులు మార్కెట్‌కు తెచ్చి విక్రయించారు. ఇందులో సీసీఐ ఆధ్వర్యంలో 5,93,440క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేటు ట్రేడర్లు 1,53,859క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 31,815మంది రైతుల నుంచి పత్తి పంటను కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,80,187క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ ద్వారా 68,672 క్వింటాళ్లు, ప్రైవేటు ట్రేడర్లు 1,11,515క్వింటాళ్లు కొన్నారు. గత ఏడాది సీజన్‌ ముగిసే నాటికి 4,52,201క్వింటాళ్ల పత్తిని కొన్నారు. ఇందులో 1,38,185క్వింటాళ్ల పత్తిని సీసీఐ ద్వారా, 3,14,016 క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు ట్రేడర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన గత ఏడాది కంటే ఈ సారి ఇప్పటికే 3లక్షల క్వింటాళ్ల మేర పత్తి ఎక్కువగా మార్కెట్‌కు వచ్చింది. మార్చి నెలాఖరు వరకు సీసీఐ కొనుగోళ్లు చేయాలని భావిస్తుండగా.. భైంసా ప్రాంతంలో ఇంకా పెద్ద ఎత్తున రైతుల వద్ద నిల్వలున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా చోట్ల మాత్రం రైతుల వద్ద పత్తి నిల్వలు లేవని.. దీంతో ఈ నెలాఖరు వరకు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.

అత్యధికంగా భైంసాలో కొనుగోళ్లు

జిల్లాలో అత్యధికంగా భైంసాలో 4,31,353 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా.. నిర్మల్‌లో 1,49,202క్వింటాళ్లు, సారంగాపూర్‌లో 60,177క్వింటాళ్లు, ఖానాపూర్‌లో 36,572క్వింటాళ్లు, కుభీర్‌లో 69,995క్వింటాళ్లు పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది కన్నా ఈసారి రెట్టింపు స్థాయిలో పత్తి దిగుబడి వచ్చినట్లు ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న నిల్వలను బట్టి తెలుస్తున్నది. మరోవైపు మహారాష్ట్ర నుంచి పత్తి నిల్వలు రాకుండా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. రైతులకు గతంలో ఇచ్చిన క్యూఆర్‌ కోడ్‌ గుర్తింపు కార్డులతో పాటు ఆధార్‌కార్డును రైతులు తీసుకు రావాలనే నిబంధన అమలు చేశారు. ఇందులో ఏదో ఒక కార్డు ఉన్న పత్తి విక్రయాలకు అనుమతించారు. గతనెల 25 వరకు విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించారు. మిగతా వాటికి సీసీఐ నుంచి డబ్బులు రావాల్సి ఉంది. రెండోసారి పత్తి తీస్తుండడంతో క్వింటాలుకు రూ. 100చొప్పున కోత పెడుతున్నారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.5450చొప్పున చెల్లిస్తున్నారు. 


logo