సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 14, 2020 , 00:00:29

మధ్యాహ్న భోజన బిల్లుల పెంపు!

మధ్యాహ్న భోజన బిల్లుల పెంపు!

సారంగాపూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన బిల్లుల ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన ధరలు ఈనెల నుంచి అమలులోకి వచ్చాయి. మధ్యాహ్న భోజన బిల్లుల ధరలను పెంచాలని కొంతకాలంగా వంట ఏజెన్సీలు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితంలేకపోవడంతో విద్యార్థులకు నాసిరకం భోజనం అందించడంతోపాటు కోడిగుడ్లను కూడా సక్రమంగా పెట్టడం లేదు. దీంతో వంటలు రుచిగా లేక కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న వేళలో ఇళ్లకు వెళ్లి అన్నం తినివస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం ధరలను పెంచింది. పెరిగిన ధరలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు క్రమం తప్పకుండా గుడ్డు కూడా అందనుంది.


పెంపు ఇలా ...

మధ్యాహ్న భోజన పథకాన్ని తొలుత 2003లో 1నుంచి 8వ తరగతుల విద్యార్థులకు, 2008నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు అమలు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రస్తుతం రోజుకు రూ. 4.35 చొప్పున చెల్లిస్తుండగా ఆ ధరను రూ. 4.48కు పెంచింది. 13 పైసల చొప్పున పెరిగాయి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 6.51 చెల్లిస్తుండగా, రూ. 6.70కు పెంచింది. వీరికి 19 పైసలు చొప్పున పెరిగాయి. ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 6.51చెల్లిస్తుండగా (గుడ్డుకు రూ. 2)తో కలిపి రూ. 8.71కి పెంచారు. కాగా ఈ నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. కాగా 9,10 తరగతుల విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరిస్తుంది. 


జిల్లాలో 69వేల మంది విద్యార్థులకు ప్రయోజనం...

జిల్లాలో మొత్తం 839 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 69వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రతి రోజు మధ్యాహ్న భోజనం అందుతున్నది. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం బిల్లులను పెంచినందుకు ఏజెన్సీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo