సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 14, 2020 , 00:00:29

రేపే సహకార పోలింగ్‌

రేపే సహకార పోలింగ్‌

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సహకార ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 24 గంటల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గతంలోనే ప్రతి పీఏసీఎస్‌కు ఒక ఎన్నికల అధికారిని నియమించారు. లక్ష్మణచాంద పీఏసీఎస్‌ పరిధిలోని 13 టీసీలు ఏకగ్రీవం కావడంతో ఆ పీఏసీఎస్‌ పూర్తిగా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. దీంతో ఇక్కడ ఎన్నికలు లేకపోగా.. మిగతా 15 పీఏసీఎస్‌లు, ఒక ఎఫ్‌ఎసీఎస్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 221 టీసీలు ఉండగా.. 99 టీసీలు ఏకగ్రీవం కావడంతో 122 టీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాలతో పాటు సామాగ్రి, సిబ్బందిని నియమించారు. 16 పీఏసీఎస్‌లకు 16చోట్ల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీసీకి ఒక్క పోలింగ్‌ కేంద్రం చొప్పున 122 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం 122 మంది పీఓలు, 122 మంది ఏపీఓలు, 122మంది అదనపు పీఓలతో పాటు పది శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తం 35,062మంది ఓటర్లుండగా.. ఏకగ్రీవమైన టీసీలు మినహాయిస్తే మిగతా చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరో 24 గంటల్లో సహకార ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 122 టీసీలకు 278మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో టీసీల్లో 150-200ఓటర్లు ఉండడంతో అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. మద్యం, డబ్బులు, మాంసం ఇతర బహుమతుల రూపంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 


logo