మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 12, 2020 , 23:26:44

‘సహకారం’.. సర్వం సిద్ధం !

‘సహకారం’.. సర్వం సిద్ధం !

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు.జిల్లాలో కుభీర్‌, కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్‌ మండలంలోని ముఠాపూర్‌, మంజులాపూర్‌, సారంగాపూర్‌ మండలంలోని ఆలూరు, కౌట్ల, ముథోల్‌ మండలంలోని బిద్రెల్లి, తానూరు మండలంలోని హంగిర్గా, దిలావర్‌పూర్‌ మండలంలోని బన్సపెల్లి, ఖానాపూర్‌ మండలంలోని సత్తన్నపల్లి, ఖానాపూర్‌, కడెం మండలంలోని పాండ్వాపూర్‌, భైంసా మండలంలోని మిర్జాపూర్‌ సహకార సంఘాలుండగా.. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం ఉంది. వీటి డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీసీలకు డైరెక్టర్ల ఎన్నిక కోసం ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 15న టీసీలకు డైరెక్టర్ల కోసం పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలో 17 పీఏసీఎస్‌ల పరిధిలో 221మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా.. ఇందుకోసం నామినేషన్లను స్వీకరించారు. జిల్లాలో 99టీసీలు ఏకగ్రీవంకాగా.. 122టీసీలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 122టీసీలకు 278మంది అభ్యర్థులు తుది బరిలో ఉన్నారు.ఏకగ్రీవమైన పీఏసీఎస్‌లు, టీసీలు పోగా.. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు.

లక్ష్మణచాంద పీఏసీఎస్‌ ఏకగ్రీవం 

లక్ష్మణచాంద పీఏసీఎస్‌లో 13టీసీలు ఏకగ్రీవం కావడంతో ఈ మండలంలో పోలింగ్‌ నిర్వహించడం లేదు. మిగతా 15పీఏసీఎస్‌లు, నిర్మల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ పరిధిలో ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. డైరెక్టర్ల ఎన్నిక తర్వాత 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల్లోపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను ఆయా పీఏసీఎస్‌లలో నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 35,062 మంది ఓటర్లుండగా.. ఇందులో స్త్రీలు 8429, పురుషులు 26633 మంది ఉన్నారు. ఏకగ్రీవమైన టీసీలు వదిలేసి.. మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహిస్తుండగా.. రైతులు తమ ఓటును వేయనున్నారు. ఇప్పటికే తుది ఓటరు జాబితా ప్రకటించగా.. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్‌ సిబ్బందిని నియమించారు.  ఆయా మండల కేంద్రాలు, పీఏసీఎస్‌లు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పోలింగ్‌, ఓట్ల లెక్కింపు చేస్తారు.

16 పోలింగ్‌ కేంద్రాలు 

16 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌కు ప్రభుత్వ కస్బా హైస్కూల్‌, మంజులాపూర్‌కు జడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌, ముఠాపూర్‌కు ఎంపీపీఎస్‌, మామడలో జడ్పీహెచ్‌ఎస్‌, ఖానాపూర్‌కు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తన్నపల్లికి జడ్పీహెచ్‌ఎస్‌, పాండ్వాపూర్‌కు కడెం జడ్పీహెచ్‌ఎస్‌, కౌట్ల(బి)కు జడ్పీహెచ్‌ఎస్‌, సాయినగర్‌ ఎంపీపీఎస్‌, ఆలూరుకు జడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీపీఎస్‌, బన్సపెల్లికి దిలావర్‌పూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌, కుంటాలకు జడ్పీహెచ్‌ఎస్‌, లోకేశ్వరంకు జడ్పీహెచ్‌ఎస్‌, మిర్జాపూర్‌కు భైంసా జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాల, కుభీర్‌కు జడ్పీహెచ్‌ఎస్‌, బిద్రెల్లికి ముధోల్‌ జడ్పీహెచ్‌ఎస్‌, హంగిర్గాకు తానూరు జడ్పీహెచ్‌ఎస్‌, ఎంపీయుపీఎస్‌లను పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రాలు ఉన్న పాఠశాలలకు ఈనెల 14, 15తేదీల్లో రెండు రోజుల పాటు స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. 

పోలింగ్‌ సిబ్బంది నియామకం

పోలింగ్‌ నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందిని కూడా నియమించారు. 17 పీఏసీఎస్‌లకుగాను లక్ష్మణచాందలో అన్ని టీసీలు ఏకగ్రీవం కావడంతో ఇక్కడ ఎన్నికలు లేవు. 16టీసీలకు 16 రూట్లలో బస్సులను ఏర్పాటు చేశారు. 18మంది ఎన్నికల అధికారులను నియమించారు. 697మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించగా.. ఇందులో 241మంది పీఓలు, 241మంది ఏపీఓలు, 215మంది అదనపు పీఓలు ఉన్నారు. 17 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 13 చొప్పున టీసీల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 221పోలింగ్‌ బూత్‌లకు అదనంగా మరో 24.. మొత్తం  245 బ్యాలెట్‌ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. ఏకగ్రీవమైన టీసీలు మినహాయిస్తే మిగతా వాటికి పోలింగ్‌ ఉండగా.. అవసరం మేరకు సిబ్బంది, పోలింగ్‌ కేంద్రాలు, సామగ్రిని వినియోగిస్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 


logo
>>>>>>