శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 12, 2020 , 23:21:35

సమ్మేళనానికి సన్నాహాలు

సమ్మేళనానికి సన్నాహాలు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పదిహేను రోజుల్లోగా పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను ఈ నెల 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరుకానున్నారు. నాలుగు జిల్లాల్లో ఈ పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలెట్టారు. ఈ నెల 25లోపు వీటిని నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు స్థానిక మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పంచాయతీరాజ్‌ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. 

వివిధ అంశాలపై అవగాహన

పంచాయతీరాజ్‌ చట్టంతో పాటు పల్లె ప్రగతిపై ఈ సందర్భంగా చర్చించడంతో పాటు అవగాహన కల్పించనున్నారు. ఈ సమ్మేళనాల్లో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో వివరించనున్నారు. ఎవరి బాధ్యత ఏమిటో, సర్పంచులు, కార్యదర్శులు ఏమి చేయాలో ఈ సందర్భంగా వివరిస్తారు. ఈ సమావేశాల తర్వాత పదిరోజుల గడువు ఇస్తారు. ఆలోగా గ్రామాల రూపురేఖలు మారాల్సి ఉంటుంది. మొత్తానికి 25రోజుల్లో గ్రామాల పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్‌స్కాడ్‌లను ఏర్పాటు చేశారు. ఏ గ్రామం ఏ మేరకు అభివృద్ధి చెందుతోంది, పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందనే దానిపై అకస్మిక తనిఖీలు చేసి ఈ బృందాలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. మరోవైపు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. logo