సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 12, 2020 , 23:13:01

‘సహకార’ ఎన్నికలకు సిద్ధం

‘సహకార’ ఎన్నికలకు సిద్ధం

తాంసి : జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఊపందుకున్నది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపేలక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. మిగతా ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఎన్నికల బరిలో ఉరకలెత్తుతున్నారు. వార్డు పరిధిలో ఓటర్లు తక్కువగా ఉండడంతో పదేపదే వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. సహకార సమరంలో ఎలాగైనా గెలిచి తమ పట్టును నిలుపుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.

133 టీసీలకు ఎన్నికలు

ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 28 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా అందులో 360 టీసీలు ఉన్నాయి. ఇప్పటికే 11 సహకార సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన వార్డులను వదిలేసి మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే ఒక్క నామినేషన్‌ వచ్చిన 227 టీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 133 టీసీలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో సంబంధితశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

ఊపందుకున్న ప్రచారం

జిల్లాలోని వివిధ సహకార సంఘాల్లోని 133 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. సహకార సంఘాల్లోని అభ్యర్థులను ప్రసన్నం చేసుకునే పనిలో బరిలో నిలిచిన అభ్యర్థులు మునిగిపోయారు. ఉదయం లేచిందే ఆలస్యం ఓటర్ల ఇంటిముందు వాలిపోతున్నారు. వారికి కేటాయించిన గుర్తులను ఓటర్లకు తెలిసేలా పదేపదే వారి ఇండ్లకు వెళ్లి చూపెడుతూ తమను గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపించినట్లయితే భవిష్యత్‌లో సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని, సబ్సిడీలోన్‌లు ఇప్పస్తామని హామీలు గుప్పిస్తున్నారు. టీసీ పరిధిలో తక్కువగా ఓటర్లు ఉండడంతో వారిని ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగతా ఎన్నికలను ఏమాత్రం తీసిపోకుండా సహకార బరిలో నిలిచిన అభ్యర్థు ప్రచారం చేస్తున్నారు. 


రెండురోజులే గడువు

సహకార ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే గడువుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలైపోయారు. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహిస్తుండంతో ఓటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ బలపరుస్తున్న అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గడువు తక్కువగా ఉండడంతో ఉన్న కొద్దిపోటి ఓటర్లను కేవలం ప్రధాన నాయకులు ఒక్కరు కేవలం 5 నుంచి 10 మంది ఓటర్లతో తమకు అనుకూలంగా ఓటు వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆచరిస్తున్నారు. ఒక్క ఊరివారు కాకుండా రెండుమూడు గ్రామాలకు చెందిన ఓటర్లు ఉండడంతో వారి బంధువులు, మిత్రుల సహకారంతో తాము ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. వారికి తాయిలాలు ప్రకటించడంతోపాటు విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటింగ్‌ రోజున ఎన్నికల కేంద్రాలకు ఓటర్లను తీసుకువెళ్లేందుకు అవసరమైన వాహనాలను సైతం సమకూర్చుకుంటున్నారు.  


logo