సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 23:48:34

దిశా నిర్దేశం

దిశా నిర్దేశం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సమావేశంలో.. ఆయన దిశా నిర్దేశం చేశారు.పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైందని.. నిధుల కొరత లేకుండా ప్రతి నెలా నిధులు ఇస్తున్నామన్నారు. పల్లెప్రగతితో పాటు కొత్తగా పట్టణ ప్రగతి నిర్వహిస్తామన్నారు. వచ్చే 15రోజుల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించి, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మంత్రులను ఆహ్వానించాలని.. ఈ సమావేశంలో విధులు, బాధ్యతలు వివరించాలన్నారు. మున్సిపాలిటీలకు నిధులను సమకూరుస్తామని, ఈ నిధులతో పాటు స్థాని కంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అక్షరాస్యత విషయంలో వెనకబడినందున, సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో అదనపు కలెక్టర్ల నియామకంతో కలెక్టర్‌ల వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడంమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యమై ఉండాలని, ఎవరికి వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదని సూచించారు. విస్తృత మేథోమథనం, అనేక చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తీసుకువస్తుందని, కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు కార్యక్రమాల అమలుకు కలెక్టర్లు ప్రాధాన్యత కావాలని సూచించారు. 

రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, తక్కువ వ్యవధిలోనే రాష్ట్ర అద్భుత ప్రగతిని సాధించినట్లు తెలిపారు. మిషన్‌ భగరీథ పథకం ప్రజల రక్షితమైన నీటిని అందిస్తుందని, రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌లపై ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉందని వారు బాధ్యతగా పనిచేయాలని కోరారు. కలెక్టర్‌లు పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత నెలకొల్పడంతో పాటు పచ్చదనం పెంపొదించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కొత్త జిల్లాలు, డివిజన్‌లు మండలాలు, పంచాయతీల ఏర్పాటుతో పరిపాలన విభాగాలు చిన్నవిగా మారాయని వీటితో పల్లెలు బాగుచేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

  పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో  పంచాయతీ  రాజ్‌ సమ్మేళనాలను నిర్వహించాలని వీటికి సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీడీసీలను ఆహ్వానించాలని సూచించారు. సమ్మేళనాల్లో ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలని, విధులు, బాధ్యతలు తెలియజేయాలని మంత్రులు, ఎంపీలు, జడ్పీ చైర్మన్‌లను అతిథులుగా ఆహ్వానించాలన్నారు. గ్రామాల పరిశుభ్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

గ్రామాల్లో మొక్కలు నాటడంతో పాటు అడవులను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అక్కడి నుంచి ప్రారంభించాలన్నారు. తెలంగాణ అక్షరాస్యతలో వెనకబడి ఉందని రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మార్చేందుకు కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పాల్గొన్నారు.


logo