బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 23:46:51

ఆర్టీసీకి కాసుల వర్షం!

ఆర్టీసీకి కాసుల వర్షం!

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: ఆర్టీసీకి మేడారం జాతరతో భారీ ఆదాయం సమకూరింది. సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ (ఉమ్మడి జిల్లా) నుంచి 304 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల్‌ జిల్లాల బస్‌డిపోల నుంచి మేడారం జాతరకు సర్వీసులను నడిపింది.304 ఆర్టీసీ సర్వీసులతో దాదాపు ఏడు రోజుల పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చింది.ప్రతిరోజు జాతరకు వెళ్లే భక్తుల సంఖ్య పెరిగి పోవడంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అన్ని బస్టాండ్ల వద్ద ప్రయాణికుల కోసం నీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 304 సర్వీసులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా(ఆదిలాబాద్‌ రీజియన్‌) నుంచి మొత్తం 304 సర్వీసులను నడిపారు. ఇందులో నిర్మల్‌ డిపో నుంచి 52 బస్సులు, భైంసా డిపో నుంచి 35, ఆదిలాబాద్‌ డిపో నుంచి 55, ఆసిఫాబాద్‌ డిపో నుంచి 65 బస్సులు, మంచిర్యాల్‌ డిపో నుంచి 97 బస్సులు మొత్తం 304 నడిపారు. ఈ 304 బస్సులు కలిపి వారం రోజుల్లో 2718 ట్రిప్పులు నడిపారు. మొత్తం 6,35,277 కిలో మీటర్లు బస్సులు తిరిగాయి. 2018లో జరిగిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మొత్తం 294 బస్సులు నడుపగా ఈఏడాది అదనంగా 10 సర్వీసులను పెంచారు. వారం రోజులుగా మేడారం జాతరకు 304 బస్సులతో దాదాపు 74,615 మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చారు. 

ఆర్టీసీకి భారీగా ఆదాయం

ఆదిలాబాద్‌ రీజియన్‌ నుంచి 304 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపడంతో రూ.2,65,96,343 ఆదాయం సమకూరింది. ప్రణాళికతో సర్వీసులను నడుపడంతో ఆర్టీసీకి భారీ ఆదాయం పెరుగుతూ వస్తున్నదని అధికారులు తెలిపారు. 2018లో ఆదిలాబాద్‌ రీజియన్‌ నుంచి 294 సర్వీసులను  నడుపగా రూ.2,08,50,335 ఆదాయం సమకూరింది.గతంతో పోల్చితే ఈసారి రూ.57,46,008 అదనపు ఆదాయం సంస్థకు చేకూరింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రమాద రహిత ప్రయాణాన్ని కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2018లో 68,795 మంది ప్రయాణికులను మేడారం జాతరకు భక్తులను గమ్యస్థానానికి చేర్చగా ఈసారి 74,615 మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేశారు. 5820 మంది ప్రయాణికులు అదనంగా ఆర్టీసీని ఆదరించారు. సీఎం కేసీఅర్‌ ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో ఆర్టీసీలో ప్రవేశపెట్ట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలతో సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నది. 


logo