శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 01:06:52

‘సహకారం’.. ఏకగ్రీవం!

‘సహకారం’.. ఏకగ్రీవం!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం సోమవారం ముగిసింది. తుది బరిలో 278మంది ఉన్నారు. నేటి నుంచి ప్రచారం మరింత జోరందుకోనుంది.జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు.. జిల్లా కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఉంది. దీంతో జిల్లాలోని 17 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 6నుంచి8వరకు నామినేషన్లు స్వీకరించగా సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. జిల్లాలోని 17పీఏసీఎస్‌లు ఉండగా.. ఒక్కో పీఏసీఎస్‌లో 13నియోజకవర్గాలు (టీసీ)లు ఉన్నాయి. దీంతో 221మంది డైరెక్టరు పోస్టులు ఉండగా.. వీటికి నామినేషన్లను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 660మంది నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలనలో 25మంది నామినేషన్లు తిరస్కరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 635మంది మాత్రమే మిగిలారు. తాజాగా సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. 258మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో  99 టీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తుది బరిలో 278మంది మాత్రమే మిగిలారు.

పూర్తయిన పోలింగ్‌ కేంద్రాల ఎంపిక 

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో.. తుది బరిలో ఉండే వారిపై స్పష్టత వచ్చింది. దీంతో ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు మాత్రం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తుండగా.. ఇందుకోసం పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, పరిశీలన కూడా పూర్తయింది. డైరెక్టర్ల ఎన్నిక తర్వాత 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల్లోపు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికను ఆయా పీఏసీఎస్‌లలో నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది బరిలో నిలిచేదెవరనేది తేలిపోయింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహించే సహకార ఎన్నికల కోసం అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించారు. బీరువా, బ్యాట్‌, టార్చ్‌లైట్‌, బ్రష్‌, బకెట్‌, కొబ్బరికాయ, మంచం, కప్‌సాసర్‌, డీజిల్‌ పంపు, గౌను గుర్తులు కేటాయించారు. ఈ లెక్కన పోలింగ్‌ జరిగే టీసీల్లో అత్యధికంగా 10మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

మొత్తం 35,062మంది ఓటర్లు

జిల్లాలో మొత్తం 35,062మంది ఓటర్లుండగా.. ఇందులో స్త్రీలు 8429, పురుషులు 26633 మంది ఉన్నారు. మొత్తం 221 టీసీలకుగాను 99టీసీలకు డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 122టీసీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా..  278మంది బరిలో నిలిచారు. ఏకగ్రీవమైన టీసీల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఉన్నారు. లక్ష్మణచాందలో 13 టీసీలకుగాను అన్ని ఏకగ్రీవం కాగా.. 8 టీసీలు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, 5టీసీలు కాంగ్రెస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతు ఉండటంతో ఆ పార్టీ పీఏసీఎస్‌ కైవసం చేసుకుంది. మామడ పీఏసీఎస్‌లో 10, భైంసా మండలం మిర్జాపూర్‌లో 5, ఖానాపూర్‌ మండలం సత్తన్నపల్లి పీఏసీఎస్‌లో 12, నిర్మల్‌ మండలం మంజులాపూర్‌లో 7, ముఠాపూర్‌లో 10, దిలావర్‌పూర్‌ మండలం బన్సపెల్లిలో 3, సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి)లో 11, ఆలూరు పీఏసీఎస్‌లో 7, కడెం మండలం పాండ్వాపూర్‌లో మూడు చొప్పున టీసీలు ఏకగ్రీవమయ్యారు. సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం కాగా... ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ప్రచారంపై అభ్యర్థులు దృష్టి పెట్టనున్నారు. నేటి నుంచి ప్రచారం మరింత జోరుగా సాగనుంది. 


logo