శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 01:04:26

భైంసా ఘటనలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి

భైంసా ఘటనలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి

భైంసా, నమస్తే తెలంగాణ :భైంసా పట్టణంలో ఇరువర్గాల ఘర్షణలో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు ప్రజ్ఞపరాందే అన్నారు. ఇరువర్గాల ఘర్షణలో ధ్వంసమైన ఇండ్లను సోమవాం ఆమె పరిశీలించారు. అనంతరం పట్టణంలోని విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోడం దురదృష్టకరమని అన్నారు. జిల్లా వాసినైన తనను ఈ ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకున్నానని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోడంతో పట్టణంలోని కోర్వగల్లీవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమత, దిశ కేసుల దర్యాప్తులో పోలీసులు సమర్థవంతమైన పాత్ర పోషించారని, భైంసా ఘటనలో సైతం తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని, నిందితులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కోర్వగల్లి బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. స్వార్థం కోసం అల్లర్లు సృష్టించే వారిపై పోలీసులు నిఘా ఉంచాలని అన్నారు. వెంటనే కోర్వగల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పుస్తకాలతో పాటు కొందరి సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయని, వెంటనే వారికి పుస్తకాలు, సర్టిఫిట్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాను కోర్వగల్లీని సందర్శించిన సమయంలో చంద్రబాయి అనే పలువురు మహిళ ముస్లిం మహిళలను కాపాడినట్లు తనకు స్థాకులు తెలిపారని, చంద్రబాయిని ప్రత్యేకంగా అభినందించాలని కోరారు. ఆమె వెంట ఎస్పీ శశిధర్‌రాజు, డీసీపీవో దేవిమురళీ, డీడబ్ల్యూవో రాజ్‌గోపాల్‌, డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐలు వేణుగోపాల్‌రావు, ప్రవీణ్‌కుమార్‌, ఆర్డీవో రాజు, తహసీల్దార్‌ నర్సయ్య, బీజేపీ నాయకులు బాలాజీ సూత్రావే, నిజాం వేణుగోపాల్‌, కృష్ణదాస్‌, తోట విజయ్‌, రవిపాండే, మెంచు గంగయ్య, రాజు తదితరులు ఉన్నారు. 

బీజేపీ నాయకుల వినతి

బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్లు ఆమెకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో  కౌన్సిలర్లు గౌతం పింగ్లే, రాజేశ్వర్‌, పట్టణాధ్యక్షులు బాలాజీ సూత్రావే తదితరులు ఉన్నారు. 


logo