మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 11, 2020 , 01:02:28

ప్రతి రైతుకూ ‘కిసాన్‌ కార్డు’ అందించాలి

ప్రతి రైతుకూ ‘కిసాన్‌ కార్డు’ అందించాలి

నిర్మల్‌ టౌన్‌: భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని సంబంధిత బ్యాంకులన్నీ తమ బ్రాంచిల ద్వారా ఈనెల 15లోపు రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ కార్డులను అందజేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం బ్యాంకు అధికారులతో  ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 95, 608మంది ప్రధానమంత్రి కిసాన్‌ లబ్ధ్దిదారులకు వివిధ బ్యాంకుల ద్వారా క్రెడిట్‌ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.లబ్ధ్దిదారులు సంబంధిత బ్యాంకు బ్రాంచీలను సంప్రదించేలా విస్తృత ప్రచారంచేయాలని బ్యాంక్‌ అధికారులకు సూచించారు. అర్హత కలిగిన రైతులకుసంబంధిత బ్యాంకులో దరఖాస్తు చేసుకొని పంట, భూమి వివరాలు సమర్పిస్తే లక్షా 60వేల రూపాయల వరకు కార్డు అందేవిధంగా చూడాలన్నారు. పాడి పరిశ్రమ, చేపల పెంపకందారులకు కూడా కార్డులు ఇవ్వాలని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ క్రెడిట్‌ లబ్ధిదారులకు సామాజిక రక్షణ కల్పనలో భాగంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో భాగస్వాము లను చేయాలని కోరారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయం చేసుకొని అర్హులైన రైతులందరికీ కార్డులు అందించాలన్నారు.

67లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి

 ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలో 2020లో జిల్లాలో 67లక్షల మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని వాటిని అమలు చేసే విధంగా లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ చాంబర్‌లో సోమవారం డీఎల్‌సీసీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. హరితహారంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ 35లక్షలు, అటవీశాఖ 5లక్షలు, పోలీసుశాఖ రెండు లక్షలు, ఎక్సైజ్‌శాఖ రెండు లక్షలు, నిర్మల్‌ మున్సిపాలిటీ మూడు లక్షలు, భైంసా మున్సిపాలిటీ రెండు లక్షలు, ఖానాపూర్‌ మున్సిపాలిటీ రెండు లక్షలు, దేవాదాయశాఖ 50వేలు, నీటిపారుదలశాఖ 50వేలు, ఉద్యనవనశాఖ 2వేలు, పంచాయతీశాఖ 20వేలతో పాటు ఇతరశాఖలు కూడా 5వేల చొప్పున మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌.పి.సుధన్‌ మాట్లాడుతూ 2019లో 2కోట్ల 52లక్షల మొక్కలు నర్సరీలో పెంచగా.. రెండు కోట్ల పది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించు కోగా ఇప్పటివరకు కోటీ 12లక్షల మొక్కలు నాటామని అన్నారు. డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఈవో ప్రణీత, ఎఫ్‌డీవో గోపాల్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, మత్స్యశాఖ అధికారి దేవేందర్‌, వైద్యశాఖ అధికారి వసంత్‌రావు, ఆర్‌అండ్‌బీ శాఖ ఏఈ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>