ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 11, 2020 , 01:01:30

జాతరకు తరలివచ్చినభక్త జనం

జాతరకు తరలివచ్చినభక్త జనం

సోన్‌: నిర్మల్‌ మండలంలోని ముజ్గి గ్రామంలో నిర్వహిస్తున్న ముజ్గి మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో భాగంగా రథోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించగా.. వేలాదిగా భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని కన్నులపండువగా తిలకించారు. ఉదయం నుంచే మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు నిజామాబాద్‌, కరీంననగర్‌,  మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మొక్కులతో వచ్చిన భక్తులు ఆలయంలో బెల్లంతో తులభారం వేసి భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. యాదవులు మేక, గొర్రె పిల్లలను సమర్పించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. జాతరలో ప్రత్యేకంగా నిలిచే పసుపు, కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసిన రైతులు ఆనావాయితీగా మల్లన్నస్వామికి సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

కన్నులపండుగగా రథోత్సవం...

ముజ్గి మల్లన్న జాతరలో భాగంగా ప్రతియేడు పౌర్ణమి మరుసటి రోజు నిర్వహించే రథోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే ఏడాదంతా పాడి పంటలు, పశు అభివృద్ధి బాగా పెరుగుతుందని భక్తుల విశ్వాసంతో రథోత్సవానికి తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన రథోత్సవంలో పెద్ద సం ఖ్యలో పాల్గొన్న భక్తులు రథాన్ని మల్లన్న ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షణలు చేశారు. సాంప్రదాయ పద్దతిలో భక్తులు రథోత్సవాన్ని లాగి తమ మొక్కులను చెల్లించుకున్నారు.  జాతరకు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులకు అన్నదానంతో పాటు నీటి సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్‌యాదవ్‌, భాస్కర్‌యాదవ్‌, భూమన్నయాదవ్‌, ఎంపీటీసీ సంతోష్‌లు, నిర్మల్‌రూరల్‌ ఎస్సై బి.కృష్ణకుమార్‌ బందోబస్తు నిర్వహించారు. 


logo