సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 10, 2020 , 00:02:45

పారిశుద్ధ్య కార్మికులకు భరోసా

పారిశుద్ధ్య కార్మికులకు భరోసా

సారంగాపూర్‌: గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతం లో ఎన్నడూ లేని విధంగా కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు ఈనెల నుంచే బీమాను వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఒక్కో కార్మికుడి పేరిట రూ. 769 బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ప్రమాదం లేదా సాధారణ మరణమైనా కార్మికుడి కుటుంబానికి రూ.2 లక్షలు బీమా వర్తించనుంది. జిల్లాలోని 19 మండలాల్లో 396 గ్రామ పంచాయతీలు ఉండగా, 845 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. 

రోడ్లు ఊడుస్తూ, మురికి కాలువలు శుభ్రం చేస్తూ ఒకప్పుడు తక్కువ వేతనాలతో జీవితాలను నెట్టుకొచ్చిన పంచాయతీ కార్మికుల స్థితిగతులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగామార్చివేసింది. ఒకరి వద్ద చేయిచాచి అడిగే పరిస్థితి లేకుండా తాము చేస్తున్న పనికి తగిన వేతనాలను వారికి చెల్లిస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ పారిశుద్ధ్య నిర్వహణలోకీలకపాత్ర పోషించే కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామపంచాయతీలకు కేటాయించే నిధుల నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆలోచించారు. ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడి వేతనాన్ని రూ. 4 వేల నుంచి రూ.8,500లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల నుంచి కార్మికులకు పెంచిన వేతనాన్ని చెల్లిస్తున్నారు. దీంతో పాటు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు బీమా సౌకర్యం కల్పిస్త్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల లోపు వయస్సు ఉన్న కార్మికులను అర్హులుగా గుర్తించి 845 కార్మికులందరికీ బీమా వర్తింపజేసేందుకు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే గ్రామాల వారీగా కార్మికులను గుర్తించారు. ఎల్‌ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించి ప్రీమియం చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించారు.  ఏటా ఒక్కో కార్మికుడికి రూ.769 చొప్పున ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించనున్నారు. ప్రతి కార్మికుడికీ రూ.2లక్షల బీమా వర్తింపజేయనున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వమే రెన్యూవల్‌ చేయనుంది. 


logo