సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 09, 2020 , 23:59:01

గజ గజ..

గజ గజ..

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా చలి తగ్గి ఎండాకాలం వాతావరణం ప్రభావం కనిపించినప్పటికీ శనివారం నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా చలికాలం ప్రభావం కనపడుతున్నది.  మబ్బులు కమ్ముకోవడంతో పాటు శనివారం రాత్రి పలు చోట్లు చిరుజల్లులు కురిశాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా ఈదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చలికాలం ముగుస్తుండగా కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈనెల 4వ తేదీన17 డిగ్రీల కనిష్ఠ, 31 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఎండకాలాన్ని తలపించే వాతావరణం కనపడుతున్నది. ఈ ఏడాది చలికాలం సీజన్‌ జిల్లాలో తన ప్రభావాన్ని చూపింది. డిసెంబర్‌ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనవరి రెండో వారం వరకూ చలితీవ్రత కొనసాగింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో చలి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే శనివారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం జిల్లాలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

మధ్యాహ్న ఉష్ణోగ్రతలు సైతం పడిపోయాయి. 27 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  ఈనెల 4,5,6 తేదీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదు కాగా, శనివాం కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు నమోదైంది.

వణుకుతున్న జనం.. 

రెండ్రోజులుగా చలితీవ్రత పెరగడంతో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి ఎక్కువగా ఉంటున్నది. ఆకాశంలో  మబ్బు లు ఉండడంతో ఎండ ప్రభావం కనిపించడం లేదు. రోజంతా ఈదురు గాలులు వీస్తుండడంతో చలి ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లతో పాటు వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తమ పనుల కోసం బయటకు వచ్చేవారు స్వెట్టర్లు, తలకు మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, చలిగాలికి తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


logo