గురువారం 09 ఏప్రిల్ 2020
Nirmal - Feb 09, 2020 , 01:45:27

టార్గెట్‌ టెన్త్‌

టార్గెట్‌ టెన్త్‌
  • వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు
  • పూర్తయిన సిలబస్‌
  • వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
  • ప్రత్యేక తరగతుల నిర్వహణ

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ:  పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. పాఠ్యాంశాల బోధన నుంచి ప్రత్యేక తరగతుల వరకు ప్రణాళిక ప్రకారం కొనసాగుతుండడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గతేడాది జిల్లాలో 93.09 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని రాష్ట్ర స్థాయిలో జిల్లాను టాప్‌ 10లో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు  కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సంస్కరణలతో విద్యాశాఖలో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి!


పూర్తయిన సిలబస్‌

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో అధికారులు ఒక ప్రణాళికతో ముందుకెళ్లారు. ఫలితంగా డిసెంబర్‌లోనే సిలబస్‌ పూర్తిచేసి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి  సారించారు. సబ్జెక్టుల వారీగా వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. మెరుగైన ర్యాంకులు సాధించడంతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా సన్నద్ధం చేస్తున్నారు. 


టాప్‌ 10 టార్గెట్‌

ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 5వేల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంతో పాటు రాష్ట్ర స్థాయిలో జిల్లాను టాప్‌ టెన్‌లో నిలిపేందుకు అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. logo