శనివారం 28 మార్చి 2020
Nirmal - Feb 09, 2020 , 01:42:17

కొనసాగుతున్న‘అక్కకొండ’బ్రహ్మోత్సవాలు

కొనసాగుతున్న‘అక్కకొండ’బ్రహ్మోత్సవాలు
  • వైభవంగా సుదర్శన యాగం
  • తరలివచ్చిన భక్త జనం

కడెం : మండలంలోని దిల్దార్‌నగర్‌ గ్రామ సమీపంలోని శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు వొర్దిపర్తి వెంకటరమణచార్యులు అధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం సుదర్శనయాగం నిర్వహించగా, రెండోరోజు శనివారం కూడా మహా సుదర్శన యాగాన్ని త్రిదండి చినజీయర్‌స్వామి శిష్యులు యజ్ఞచార్యులు శ్రీమాన్‌ అనంతకుమారచార్యులు, వంశీకృష్ణమాచార్యులు యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా జంటలు ఈ మహాయాగంలో పాల్గొన్నారు. ఉభయ వేదాంత ప్రవర్తకులు పురస్కార గ్రహీత శ్రీమాన్‌ మందపల్లి పరాంకుశచార్యస్వామి మాట్లాడుతూ..శ్రీ సుదర్శనం అత్యంత పవిత్రమైనదని, ఇది భగవంతునికి అంగరంగంగా ఉండి సర్వజీవులను రక్షిస్తుందని అన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన శ్రీనారసింహ అవతారం చాల క్రూరమైనదని, ఈ యాగంతో భయం తొలగి సర్వత్రా విజయం చేకూరుతుందని భక్తులకు వివరించారు. 


నాల్గో రోజు ఆలయంలో పూజలు చేసేందుకు మాజీ ఎంపీ కడెం నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, ఖానాపూర్‌ నూతన మున్సిపల్‌ చైర్మెన్‌ అంకం రాజేందర్‌, కౌన్సిలర్లు తొంటి శ్రీనివాస్‌, కావలి సంతోష్‌లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ కార్యవర్గానికి ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు శాలువలతో ఘనంగా సత్కరించారు. అయితే నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, జిల్లాలతో పాటు, కరీంగనర్‌, జగిత్యాల, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కాగా, ఆదివారం ఆలయంలో మహాపూర్ణహుతి, 11వ తేదీన అర్ధరాత్రి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు ఆగునూరి సత్తమ్మ, మేకల రాజారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు పోతురాజు రమేశ్‌, నాయకులు గంగన్న, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


logo