సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 08, 2020 , 03:43:28

పాల సేకరణే ‘లక్ష’్యం..

పాల సేకరణే ‘లక్ష’్యం..
  • ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 25వేల లీటర్ల పాల సేకరణ
  • నిర్మల్‌, ఆదిలాబాద్‌, లక్షెట్టిపేట్‌లో పనులు పూర్తి
  • లక్ష లీటర్ల పాల సేకరణ దిశగా కార్యాచరణ
  • రూ. 18కోట్లతో పాల శీతలీకరణ కేంద్రాలు
  • మిగతా చోట్ల కొనసాగుతున్న నిర్మాణ పనులు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విజయ డెయిరీని నిర్వహిస్తున్నారు. రైతుల వద్ద నుంచి పాలను సేకరించి చిల్లింగ్‌ చేయడంతో పాటు వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, లక్షెట్టిపేట్‌, కడెం, భైంసా, తదితర ప్రాంతాల్లో విజయా డెయిరీ ఆధ్వర్యంలో పాల శీతలీకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐదు ప్రాంతాల్లో ఒక్కోచోట 5వేల లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణపై దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాకు చెందిన లోక భూమారెడ్డి తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బా ధ్యతలు చేపట్టాక విజయ డైయిరీని లాభాల బాట లో నడిపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.140 కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని రూ. 51కోట్ల లాభాల్లోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 500కోట్ల పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారం చేసిన విజయ డెయిరీ ప్రస్తుతం రూ.800 కోట్ల వ్యాపారాన్ని చేస్తోంది. మార్చి నెలఖారుకు రూ. వెయ్యి కోట్ల వ్యాపారం లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణ పెంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. 


కొత్తగా పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు..

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచడంతో పాటు కొత్తగా పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 25వేల లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకరణ కేంద్రాలుండగా.. వచ్చే ఆరు నెలల్లో లక్ష లీటర్ల సామర్థ్యం గల కేంద్రాలను అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉన్నటువంటి పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచడంతో పాటు కొత్తగా అవసరాన్ని బట్టి పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఉన్న ఐదు వేల లీటర్ల కేంద్రాన్ని 20వేల లీటర్లకు, లక్షెట్టిపేట్‌లో ఉన్న 5వేల లీటర్ల కేంద్రాన్ని 20వేల లీటర్లకు, నిర్మల్‌లో ఉన్న 5వేల లీటర్ల కేంద్రాన్ని 10వేల లీటర్ల సామర్థ్యానికి పెంచుతున్నారు. మరోవైపు కుంటాల, లోకేశ్వరం, భైంసా మండలం దేగాం, జైనథ్‌, బేల, ఖానాపూర్‌, ఉట్నూరు, ఇచ్చోడ, బోథ్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి లాంటి చోట్ల పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు టీఎస్‌డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంపు కోసం నిధులు కావాలని కోరారు. దీంతో రూ. 18కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. ఇందులో కొన్నిచోట్ల పనులు పూర్తవ్వగా.. మరికొన్నిచోట్ల ప్రగతిలో ఉన్నాయి.


వచ్చే 3-6 నెలల్లోపు అన్నిచోట్ల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 25వేల లీటర్ల పాలను సేకరిస్తుండగా.. వచ్చే ఆరు నెలల్లోపు దీన్ని లక్ష లీటర్లకు తీసుకవెళ్లాలని లక్ష్యంగా ఉంది. ఇందుకు అవసరమైన పాల శీతలీకరణ కేంద్రాలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు రైతుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై పాడి పశువులను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75శాతం రాయితీ ఉండగా.. ఇతర రైతులకు 50శాతం రాయితీ ఇస్తున్నారు. ఒక్కో గేదె ధర రూ. 80వేల వరకు ఉండగా.. రైతుల ఇష్టం మేరకు ఏ రాష్ట్రంలోనైనా కొనుగోలు చేసుకోవచ్చు. రాయితీ డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 2వేల పాడి పశువులను పంపిణీ చేయగా.. మరో 1200 పాడి పశువులను పంపిణీ చేసేలా ముందుకు సాగుతున్నారు. మరోవైపు పాల శీతలీకరణ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఐకేపీ ఆధ్వర్యంలో పాల సేకరణ నడుస్తోంది. గ్రామాల్లో రైతులు.. పాడి పారిశ్రామిక సంఘాల్లో పోస్తుండగా.. అక్కడి నుంచి పాల శీతలీకరణ కేంద్రాలకు ఆటోల్లో తీసుకొస్తున్నారు. ఈ విధంగా వచ్చిన కమీషన్‌ నుంచి ఐకేపీ సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారు. ఇకపై ఐకేపీ సిబ్బందిని విజయ డెయిరీలోకి విలీనం చేయాలని నిర్ణయించారు. విజయా డెయిరీ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది విక్రయాలు జరిపేలా అన్ని జిల్లాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో పాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల కూడా వాటిని విస్తరిస్తున్నారు. ఇకపై ఐసీడీఎస్‌, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో విజయా డెయిరీ ద్వారానే పాల సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. 


logo