శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Feb 07, 2020 , 01:01:03

కంది రైతుకు ‘మద్దతు’

కంది రైతుకు ‘మద్దతు’
  • క్వింటాలుకు రూ. 5,800 చెల్లింపు
  • ‘ప్రైవేటు’ కన్నా ప్రభుత్వ మద్దతు ధర రూ. వెయ్యి అదనం
  • జిల్లాలో ఇప్పటి వరకు మూడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • వారం రోజుల్లో మరో మూడు ఏర్పాటుకు చర్యలు
  • జిల్లాలో 50 వేల ఎకరాల్లో కందిసాగు
  • మొత్తం లక్ష క్వింటాళ్ల సేకరణ లక్ష్యం
  • ఇప్పటి వరకు ఐదు వేల క్వింటాళ్ల కొనుగోలు

నిర్మల్‌ టౌన్‌ : కంది రైతుకు చింతలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ప్రైవేటు కన్నా రూ. వెయ్యి అదనంగా పొందడంతో ఆనందంగా ఉన్నాడు. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 50వేల ఎకరాలకు పైగానే కంది పంట సాగైనట్లు అధికారులు అంచనా వేశారు. పంట చేతికి రావడంతో ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, వారం రోజుల్లో మరో మూడు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో లక్ష క్వింటాళ్ల వరకు కందులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వింటాలుకు రూ. 5800 ధర చెల్లిస్తుండగా, వారం రోజుల్లో 5200 క్వింటాళ్ల కందుల కొనుగోలు చేసినట్లు మార్కెట్‌శాఖ అధికారులు తెలిపారు. 


నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో వానాకాలం సీజన్‌లో కంది పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ద్వారా ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. జిల్లాలో  వర్షాలు విస్తారంగా కురియడంతో జిల్లాలో 50వేల ఎకరాలకు పైగానే కంది పంట సాగైనట్లు అధికారులు అంచనా వేశారు.  ప్రధానంగా  రైతులు సాగు చేసుకునే పంటల్లో అంతరపంటగా కంది పంటను సాగు చేస్తారు. జిల్లాలో మొత్తం 72 వ్యవసాయ క్లస్టర్లుండగా.. ఆయా క్లస్టర్ల పరిధిలో ఈసారి రైతులు పత్తితో పాటు సోయా, పసుపు, మొక్కజొన్న, ఇతర పంటలను సాగు చేయగా.. అంతర పంటగా కందుల పంటను సాగు చేశారు. కంది పంట చేతికి రావడంతో ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. జిల్లాలో మొత్తం ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష క్వింటాళ్ల వరకు కందులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా  పెట్టుకుంది. మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ ద్వారా ఇప్పటికే జిల్లాలో కుభీర్‌, భైంసా, నిర్మల్‌ వ్యవసాయ  మార్కెట్‌ కమిటీలో కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ. 5800 చెల్లిస్తుంది. వారం రోజుల క్రితమే ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5200 క్వింటాళ్ల కొనుగోళ్లను నిర్వహించినట్లు మార్కెట్‌శాఖ అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో సారంగాపూర్‌, ముథోల్‌, తానూరు మండలాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు తీసుకంటున్నారు. 


పారదర్శకంగా కొనుగోళ్లు..

కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కందులను కొనుగోలు చేస్తన్నారు. రైతులు పండించిన కంది పంట ధ్రువీకరణతో పాటు పట్టాపాసుపుస్తకం కాపీ, బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబరు, వీఆర్వో ధ్రువీకరణపత్రంతో పాటు కందులను మార్కెట్‌కు తీసుకొస్తేనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో దళారుల వ్యవస్థకు పూర్తిగా చెక్‌ పడింది. తీసుకొచ్చిన కందులను మిషన్‌లో పరీక్షిస్తున్నారు. 12శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు రెండు శాతం వ్యర్థ పదార్థాలు, తిండి గింజలు, మూడు శాతం దెబ్బతిన్న గింజలు, 4శాతం కొద్దిగా దెబ్బతిన్న గింజలు, 3శాతం పరిపక్వత ఉన్న కందులను  కొనుగోలు చేస్తున్నారు. ఈసారి కంది సాగుకు వాతావరణం అనుకూలించడం, కంది పంటకు ఆశించిన స్థాయిలో తెగుళ్లు లేకపోవడంతో దిగుబడులు పెరగడమే కాకుండా నాణ్యమైన పంట వచ్చింది. ఇప్పటికే నిర్మల్‌, భైంసా, కుభీర్‌లో కందుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున కందులు మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను పెంచి ఏరోజుకారోజు తూకం వేసేలా మార్కెటింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. 


ప్రైవేటు కన్నా ప్రభుత్వ ధర అధికం..

ప్రస్తుతం క్వింటాలుకు రూ. 5800 చెల్లిస్తున్నారు. ప్రైవేటులో రూ.4600 నుంచి 4800 చెల్లిస్తున్నారు. ప్రైవేటు కన్నా  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ. వెయ్యి  అదనంగా ధర వస్తుండడంతో  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వస్తున్నారు. దీంతో ప్రైవేటు మార్కెట్లో దళారుల వ్యవస్థకు పూర్తిగా చెక్‌ పెట్టడం జరిగిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి మోసాలు ఉండవని రైతులకు వివరిస్తున్నారు. పంటను మాత్రం నాణ్యమైనదిగా తీసుకొస్తే 24 గంటల్లోనే కొనుగోలు పూర్తిచేసి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. 


ప్రభుత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే కంది పంటను రైతులు విక్రయించుకోవాలి. జిల్లాలో ఇప్పటికే కుభీర్‌, భైంసా, నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో కందుల కొనుగోళ్లను ప్రారంభించి ఐదు వేల క్వింటాళ్లు కొనుగోలు చేశాం. త్వరలో సారంగాపూర్‌, ముథోల్‌, తానూరులో కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకంటున్నాం. రైతులు కంది పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు. ప్రైవేటు కన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వెయ్యి అదనంగా ధర చెల్లిస్తున్నాం

-ప్రవీణ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ అధికారి


logo