శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 07, 2020 , 00:57:51

సుందర పట్టణంగా తీర్చిదిద్దుతా!

సుందర పట్టణంగా తీర్చిదిద్దుతా!
  • అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
  • మంత్రి అల్లోల సహకారంతో ముందుకెళ్తా
  • ఏడాదిలోపే నా మార్కు.. మార్పును చూపిస్తా
  • ‘నమస్తే తెలంగాణ’తో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌

నిర్మల్‌/ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ‘నిర్మల్‌ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే నా ముందున్న లక్ష్యం. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తా..’ అని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ పేర్కొన్నారు. కొత్తగా మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో ముందుకెళ్తానని  పేర్కొన్నారు.  ఏడాది లోపే తన మార్కు, మార్పు చూపుతానని, తమ ప్రభుత్వం, మంత్రి అల్లోల ఉండడంతో నిధులకు కొరత ఉండదన్నారు. మున్సిపాలిటీలో అధికారులతోపాటు పాలక వర్గ సభ్యుల నుంచి కూడా అవినీతి జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తామని తెలిపారు. నిర్మల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.  


నమస్తే తెలంగాణ : మొదటి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎలాంటి అభివృద్ధి చేశారు?

మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ : మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో పని చేశా. మున్సిపల్‌ స్థలంలో అక్రమణలు తొలగించి ఇందిరమ్మ కాంప్లెక్స్‌ నిర్మించాం. ట్యాంక్‌బండ్‌ పార్క్‌ వద్ద 12-14 ఫీట్ల రో డ్డును 40ఫీట్ల రోడ్డుగా మార్చాను. బోటింగ్‌, పర్యాటక అభివృద్ధి చేశాం. ఎన్టీఆర్‌ మార్గ్‌లో అందరిని ఒప్పించి.. ఎంపీ నిధులతో నిదానమైన రోడ్డు వేశాం. కూరగాయల మార్కెట్‌ అభివృద్ధి చేశాం. ఇంద్రానగర్‌, బుధవార్‌పేట్‌, ఈద్గాం వంటి చోట్ల రోడ్లను వెడల్పు చేయించాం. ఆదిలాబాద్‌ జిల్లాలోనే తొలిసారిగా సెంట్రల్‌ లైటింగ్‌ ఏ ర్పాటు చేశాం. స్టేడియం అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఆరుగురు ఎమ్మెల్యేల నుంచి రూ.30లక్షలు నిధులు మం జూరు చేయించాం. స్వర్ణ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలి.. వేసవిలో నీట సమస్య లేకుండా చూశాం. మురికి వాడ ల్లో బోర్లు వేసి.. తాగునీటి సమస్యను పరిష్కరించాం.


రెండోసారి చైర్మన్‌గా అవుతారని అనుకున్నారా?

గతంలో చేసిన అభివృద్ధి, మంచితనం, నిజాయితీ.. మంత్రి అల్లోల సహకారం, ప్రజల ఆశీస్సులతోనే రెండోసారి చైర్మన్‌గా అవకాశం వచ్చింది. గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినా.. అందరు కౌన్సిలర్లను కలుపుకుని వెళ్లా. పార్టీలకతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేశా. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఇలా విభిన్న పార్టీల కౌన్సిలర్లను కలుపుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేశా. న్యూబస్టాండ్‌, చైన్‌గేట్‌ వద్ద వివిధ మతాల వారి మసీదులు, శ్మశానవాటికలు ఉండగా.. అన్ని మతాల వారితో మాట్లాడి ఒప్పించి తీయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశాం. సంక్షేమ ప థకాలను అన్ని కులాల వారికి, చేతివృత్తుల వారికి అం దేలా చూశాం. అందుకే ఒకే వ్యక్తి రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌గా కావడం ఇదే నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో తొలిసారి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. సమస్యలు పరిష్కరించి.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.


నిర్మల్‌ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? 

నిర్మలమైన పట్టణంగా మార్చడమే నా ముందున్న లక్ష్యం. ఇప్పటికే మంత్రి అల్లోల నిర్మల్‌ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు, సుందరీకరణ చేపట్టారు. పాత బస్తీలో రోడ్లు విస్తరణ కోసం మంత్రి అల్లోలతో మా ట్లాడాం. అందరి సహకారంతో.. అందరిని ఒప్పిం చి.. పరిహారం చెల్లించి రోడ్లు విస్తరిస్తాం. మంచినీటి సమస్య లేకుండా చూస్తాం. ప్రతిరోజు ఉదయాన్నే పట్టణంలో విస్తృతంగా పర్యటించి.. సమస్యలు తెలుసుకుంటా. మా దే రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి అల్లోల ఉండడంతో నిధుల కొరత ఉండదు.  కూరగాయల మార్కెట్‌లో రెగ్యులర్‌ వారికి, గ్రామాల వారికి వేర్వేరు బ్లాకులు ఏర్పాటు చే స్తాం. పట్టణానికి నాలుగువైపులా కూరగాయల మా ర్కె ట్లు అభివృద్ధి చేస్తాం. జౌలినాలా నీరు తాత్కాలికంగా చేసి.. ఆరు నెలల్లో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతాం. ధర్మసాగర్‌ మాదిరిగానే కంచరోడి కట్టను అభివృద్ధి చేయాలనేది నా వ్యక్తిగత ఆలోచన. మంత్రితో ఇప్పటికే చర్చించాం. జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రజల ఇబ్బందులు తీరుస్తాం. జిల్లా కేంద్రం కావటంతో.. ఇది రహదారి అనేలా మారుస్తాం. 


మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం అవినీతి చేయకుండా ఎలాంటి చర్యలు చేపడతారు?

మున్సిపాలిటీలో అధికారులతో పాటు పాలక వర్గ సభ్యుల నుంచి కూడా అవినీతి జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతాం. నేను గతంలో చైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ సారి అవినీతి అనే మాట వినిపించకుండా చేస్తా. అనుమతులు, మ్యూటేషన్లు, వంశపారంపర్య ఆస్తుల పత్రాలు.. ఇబ్బందులు లేకుండా చూస్తాం. నన్ను నేరుగా ప్రజలు కలిసేలా.. సమయం కేటాయిస్తాం. కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. 


మున్సిపల్‌ ఎన్నికల్లో విపక్షాలు చేసినా.. దుష్ప్రచారం, విమర్శలను ఎలా తిప్పి కొట్టారు..?

విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. చివరికి ధర్మమే గెలిచింది. పట్టణం అభివృద్ధి కోసం మంత్రి అల్లోల సీరియస్‌గా కృషి చేస్తున్నారు. మాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. నిర్మల్‌ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ దక్కించుకుంటుందని, రెండో సారి చైర్మన్‌గా అవుతామని ముందే అనుకున్నాం. గత మున్సిపల్‌ పాలక వర్గం 8నెలలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రూ.50కోట్ల నిధులు మురిగిపోయాయి. పాత పాలకవర్గం దిగిపోగానే.. రూ.50కోట్లు వెచ్చించి పట్టణంలో రోడ్లు, మురికి కాల్వలతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రి అల్లోల కృషి చేశారు. ఈ ప్రభుత్వం, మంత్రి అల్లోల హయాంలో అభివృద్ధి ఉందని ప్రజలు నమ్మారు. అం దుకే మమ్మల్ని భారీ మెజారిటీ సీట్లతో గెలిపించారు.


logo