ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Feb 06, 2020 , 00:07:03

మళ్లీ నిరాశే..

మళ్లీ నిరాశే..
  • ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌కు మరోసారి మొండిచేయి
  • బడ్జెట్‌లో నిధులు కేటాయించని కేంద్రం

ఆదిలాబాద్‌ , నమస్తే తెలంగాణ ప్రతినిధి:ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ పనులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లావాసులు నిరాశకు లోనయ్యారు. 2017 బడ్జెట్‌లో రైల్వేలైన్‌ మంజూరు చేసినా నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభంకావడం లేదు. నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు రైల్వేలైన్‌ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేండ్లుగా ఉమ్మడి జిల్లా ప్రజలు నిధుల కోసం ఎదురు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధులు మంజూరు చేయాలని కేంద్ర పెద్దలను పలుమార్లు కోరినా ఫలితం ఉండడం లేదని పలువురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్లాలంటే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల మీదుగా 9 నుంచి 10గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. 


2009-10 రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌చెరు వరకు రైల్వేలైన్‌ మంజూరైంది. అయితే నిర్మాణ వ్యయం రూ.3,771 కోట్లు అవుతుండడంతో ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ లైన్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు రైల్వేలైన్‌వేస్తే అక్కడి నుంచి నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు రైలులో వెళ్లే అవకాశాలుండడంతో 2017 బడ్జెట్‌లో ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ లైన్‌కు మంజూరు లభించింది. సర్వే నిర్వహించిన అధికారులు రూ.2,990 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.  అప్పటి నుంచి ఈ లైన్‌కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఉమ్మడి జిల్లా వాసులు ప్రతి బడ్జెట్‌లో ఎదురు  చూస్తున్నా నిరాశే ఎదురవుతున్నది. మూడేండ్లుగా కేంద్ర ప్రభు త్వం ఒక్కపైసా విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిధుల మంజూరు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు కేంద్ర పెద్దలను పలుమార్లు కలిసి విజప్తి చేసినప్పటికీ ఈ బడ్జెట్‌లో సైతం కేంద్రం నిధులు కేటాయించలేదు. logo