గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 06, 2020 , 00:04:50

ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

బాసర : బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో పీయూసీ-1 చదువుతున్న బోన్ల సంజయ్‌ అనే విద్యార్థి హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కోలిప్యాక గ్రామానికి చెందిన సంజయ్‌ ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నాడు. మంగళవారం రాత్రి బోన్ల సంజయ్‌ తన స్నేహితుడితో కలిసి పీయూసీ-1 చదువుతున్న సాయివరుణ్‌ అనే విద్యార్థి ఉండే హాస్టల్‌ గదికి వెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. ఈ విషయమై సాయివరుణ్‌ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు సంజయ్‌ స్నేహితులను ఆఫీస్‌కు పిలిపించి వారి తల్లిదండ్రులను కళాశాలకు రావాలని సమాచారం అందించారు. వారందరినీ మంగళవారం రాత్రి నుంచి కంట్రోల్‌ రూంలోనే ఉంచినట్లు తెలిపారు. 


బుధవారం ఉదయం 11గంటలకు సంజయ్‌ తాను మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి హాస్టల్‌ భవనం నాలుగో అంతస్తుకు ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన విద్యార్థులు అధికారులకు సమాచారం అందించగా.. వెంటనే కళాశాల దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వీసీ అశోక్‌కుమార్‌ దవాఖానకు వెళ్లి సంజయ్‌ను పరామర్శించారు. అక్కడున్న డాక్టర్లను విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఉన్న సంజయ్‌ తల్లిదండ్రులు, అన్నతో వీసీ అశోక్‌ మాట్లాడారు. తాము బీద పరిస్థితుల్లో ఉన్నామని, వైద్య ఖర్చులు భరించలేమని బాధపడడంతో స్పందించిన వీసీ అశోక్‌కుమార్‌ చికిత్స ఖర్చులకు యూనివర్సిటీ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 


logo