గురువారం 09 ఏప్రిల్ 2020
Nirmal - Feb 06, 2020 , 00:04:50

రిమ్స్‌లో పలువురు చిన్నారులకు అస్వస్థత

రిమ్స్‌లో పలువురు చిన్నారులకు అస్వస్థత

ఎదులాపురం : వ్యాధి నిరోధక ఇంజక్షన్‌ వికటించి పది మంది పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం ఆదిలాబాద్‌ జిల్లాలోని రిమ్స్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రిమ్స్‌లోని పిల్లలవార్డులో రోజూ మాదిరిగానే 8 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 30 మంది చిన్నారులకు బుధవారం ఉదయం వైద్యులు వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత 10 మంది చిన్నారులకు దద్దుర్లు రావడంతో పాటు వాంతులు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ గజానంద్‌కు సమాచారం అందించడంతో వెంటనే ఆయన పిల్లలకు వైద్య చికిత్సలు అందించారు. విషయాన్ని తెలుసుకున్న రిమ్స్‌ డైరెక్టర్‌ బానోత్‌ బలరామ్‌ నాయక్‌ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోజూ మాదిరిగానే పిల్లల వార్డులో వైద్య సిబ్బంది వ్యాధి నిరోధక ఇంజక్షన్‌ చేశారని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామన్నారు. పిల్లలకు ఇచ్చిన ఇంజక్షన్‌ మందుల శ్యాంపిళ్లను మైక్రో బయాలజీ ల్యాబ్‌కు పంపించామని, రెండు మూడు రోజుల్లో ల్యాబ్‌ రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తు తం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 


logo