బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 05, 2020 , 01:17:43

నిర్మలమైన జిల్లాగా మారుస్తా!

నిర్మలమైన జిల్లాగా మారుస్తా!
  • పారిశుద్ధ్యం, విద్య, వైద్యానికి ప్రాధాన్యం
  • ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లా అభివృద్ధి
  • పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
  • అధికారుల పనితీరుపై ప్రతి వారం నివేదిక
  • ప్రజా ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేకాధికారి
  • సమస్యల పరిష్కారంపై అధికారులదే బాధ్యత
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

‘జిల్లాలో పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై  ప్రత్యేక దృష్టి సారిస్తాం.పల్లెలు, పట్టణాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తాం. ‘నిర్మల’మైన జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తాం..’ అని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ స్పష్టం చేశారు. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం లేకపోయినా.. తెలంగాణ ప్రాంతానికి చెందినవాడినే కావడం, పక్కనే ఉన్న జగిత్యాల జిల్లాలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈ ప్రాంతంపై కొంత అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వంలోని వివిధ విభాగాలను మరింత పారదర్శకంగా పని చేసేలా విధానంలో మార్పు తీసుకొస్తామన్నారు. ప్రతి అధికారి పనితీరుపై వారం వారం నివేదికలు తీసుకుంటామని, డాక్యుమెంట్‌ చేసి సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 


నమస్తే తెలంగాణ : తొలిసారి కలెక్టర్‌గా వచ్చినందున ఎలా ఫీలవుతున్నారు.. నిర్మల్‌ జిల్లా గురించి గతంలో అవగాహన ఏమైనా ఉందా.. ?

జిల్లా కలెక్టర్‌ : జిల్లా కలెక్టర్‌గా తొలిసారి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జిల్లాలో పని చేసిన అనుభవం లేదు. కొంత మేర అవగాహన మాత్రం ఉంది. గతంలో పక్కనే ఉన్న జగిత్యాల జిల్లాలో పని చేశాను. గోదావరి నదికిపై అటువైపున జగిత్యాల.. ఇటువైపున నిర్మల్‌ జిల్లాలున్నాయి. ఈ రెండు జిల్లాలో దాదాపు ఒకే రకమైన పరిస్థితులు, పంటలు, ప్రజల జీవన విధానం ఉంది. జిల్లాలో సహజ సిద్ధమైన అడవులు, పర్యావరణం ఉంది. ఐదు మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. జాతీయ రహదారి ఉండడం, అటవీ విస్తీర్ణం, గోదావరి నది, ఎస్సారెస్పీ ఉండడం అదనపు ప్రయోజనం. ప్రజలు చాలా మంచి వారని తెలిసింది. ఏడాది కాలంగా జరిగిన వివిధ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పసుపు, వరి, మక్కలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో జిల్లా ముందుంది. తెలంగాణలోనే అత్యధికంగా లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ అభివృద్ధి చేసేందుకు మరింత అవకాశం ఉంది. 


ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీ కార్యాచరణ ఏంటీ?

జిల్లాలో పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. జగిత్యాల జిల్లాలో పని చేసినప్పుడు పల్లెలపై, జీహెచ్‌ఎంసీలో పని చేయడంతో పట్టణాల సమస్యలపై అవగాహన వచ్చింది. పట్టణాల్లో పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతాం. జిల్లాలో ముఖ్యంగా విద్య, వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్‌ పెడుతాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి 30రోజుల ప్రత్యేక ప్రణాళిక రెండు విడతల్లో నిర్వహిస్తున్నందున.. ఆ దిశగా దృష్టి సారిస్తాం. ఏరియా దవాఖానల్లో వసతులు మెరుగు చేస్తాం. కేసీఆర్‌ కిట్‌, గర్భిణులకు సర్కారు డబ్బులు ఇవ్వడంతో ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు పెరుగుతున్నాయి. పదో తరగతి ఫలితాల మెరుగు కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. ప్రత్యేక శిక్షణా తరగతులు పెడతాం. ఈ-ఆఫీస్‌, బయోమెట్రిక్‌ విధానం మరింత బలోపేతం చేస్తాం. గతంలోని కలెక్టర్‌ అమలు చేసిన కార్యక్రమాలపై సమీక్ష చేసి.. కొనసాగిస్తాం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడతాం. 


ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కారం కావ డం లేదని, తీవ్ర జాప్యమవుతున్నాయనే విమర్శలున్నాయి. దీనిపై మీ కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది..?

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విధానం అమలు చేస్తాం. ఏ అధికారి ఏం చేశారో ప్రతి వారం సమీక్షిస్తాం. పదే పదే వచ్చే ఫిర్యాదులు, పరిష్కారం కాకుండా ఉన్న వాటిపై ఓ అధికారితో విచారణ చేయిస్తాం. ఇన్ని సార్లు ఎందుకు వస్తున్నారు.. నిజంగా పరిష్కారం చేయలేమా.. ఏ కారణాలతో చేయలేపోతున్నాం.. అనేది సదరు అధికారి నాకు సమగ్రంగా నివేదిక ఇస్తారు. మా పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తాం. లేదంటే ఏ కారణంతో పరిష్కారం కావడం లేదో ఫిర్యాదుదారులకు స్పష్టత ఇస్తాం. వారి సమయం వృథా కాకుండా చూస్తాం. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అధికారిని బాధ్యులను చేస్తాం. 


జిల్లా ప్రజలకు దగ్గరయ్యేందుకు, సమస్యల పరిష్కారానికి ఏం చేయబోతున్నారు..?

ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో సమస్యల పరిష్కారం చేస్తాం. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాం. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తాం. ప్రతి రోజు సాయంత్రం 4-5గంటల మధ్య గంట సేపు విజిటింగ్‌ అవర్‌ పెట్టాం. ఈ సమయంలో ప్రజలు, ఫిర్యాదుదారులు వచ్చి కలెక్టరేట్‌లో నేరుగా కలవవచ్చు. క్యాంపునకు వెళ్లిన రోజుల్లో తప్ప, మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటాం. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తాం. అందరు అధికారులతో చేయిస్తాం. ప్రజాప్రతినిధులను కలుపుకుని పోతాం. ప్రజా భాగస్వామ్యంతోనే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తాం. 


జిల్లాపై కలెక్టర్‌గా భవిష్యత్తులో మీ మార్కు ఎలా ఉండబోతున్నది?

ప్రతి వ్యక్తి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు ప్రభుత్వంపై ఏదో విధంగా ఆధారపడతారు. ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తోంది. ప్రభుత్వ సేవలు అందించేందుకు అనేక విభాగాలు, శాఖలు ఉన్నాయి. ప్రజలకు మరింత పారదర్శకమైన సత్వర సేవలను అందించేందుకు ప్రభుత్వ శాఖలు, అధికారుల విధానంలో మార్పు తీసుకువస్తాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగిస్తాం. ప్రతి అధికారి వారంలో ఏం పని చేశారనేది సమీక్షిస్తాం. ప్రతి వారం పని తీరుపై డాక్యుమెంట్‌ చేసి.. పర్యవేక్షణ చేస్తాం. దాని ఆధారంగానే అధికారుల పనితీరు అంచనా వేస్తాం. 


కలెక్టర్‌ వ్యక్తిగత వివరాలు

పూర్తి పేరు : ముషారఫ్‌ అలీ ఫారూఖీ

తండ్రి : ముర్తుజా అలీ ఫారూఖీ, రిటైర్డు జాయింట్‌ కమిషనర్‌, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌

తల్లి : రహమతుల్లా

స్వస్థలం : మహబూబ్‌నగర్‌

నివాసం : హైదరాబాద్‌

విద్యాభ్యాసం : హైదరాబాద్‌

ఉన్నత, సాంకేతిక విద్యాభ్యాసం : ఇంజినీరింగ్‌-ఐఐటీ, బెంగళూర్‌

తొలి ఉద్యోగం : బెంగళూరులో ఇంటెల్‌ కంపెనీలో చీఫ్‌ డిజైనర్‌

ఐఏఎస్‌ బ్యాచ్‌ : 2014

తొలి పోస్టింగ్‌ : మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌, 2017.. ఆరు నెలల పాటు జగిత్యాల జాయింట్‌ కలెక్టర్‌.. రెండేండ్ల పాటు జీహెచ్‌ఎంసీలో సెంట్రల్‌ జోన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా విధులు

తొలిసారి కలెక్టర్‌ : నిర్మల్‌ జిల్లాకే.. 2020, ఫిబ్రవరి 3నుంచి

స్ఫూర్తి : తండ్రి ముర్తుజా అలీ ఫారూఖీ

ఆటలు : అవుట్‌ డోర్‌ గేమ్స్‌, సైక్లింగ్‌ 


logo
>>>>>>