సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 05, 2020 , 01:02:41

‘టోలు’ తీస్తున్నారు..!

‘టోలు’ తీస్తున్నారు..!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:  నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మొత్తం నాలుగు చోట్ల టోల్‌గేట్లున్నాయి. జాతీయ రహదారిపై 44పై మూడు చోట్ల ఉండగా.. జాతీయ రహదారి 61పై ఒక చోట టోల్‌ గేట్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి 44పై నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గంజాల్‌ వద్ద, ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్‌ మామడ, జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ వద్ద ఉండగా.. జాతీయ రహదారి 61పై నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండల కేంద్రం సమీపంలో టోల్‌గేట్లు ఉన్నాయి. ఇక్కడ వాహనదారుల నుంచి టోల్‌గేట్‌ రూపంలో పన్నును వసూలు చేస్తున్నారు. ఈ టోల్‌గేట్లలో డిసెంబరు 15 నుంచి ఫాస్టాగ్‌ అమలు చేస్తున్నారు. ఫాస్టాగ్‌ వైపు కొందరు వాహనదారులు మళ్లకపోవడంతో కేం ద్రం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు వైపు మళ్లించే దిశగా.. ఒత్తిడి తెచ్చి మరి ఫాస్టాగ్‌ కొనిపించేలా చర్యలు చేపట్టింది. 

ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలకు మాత్రమే రాయితీ

గతంలో టోల్‌గేట్‌ దాటి వెళ్లిన వాహనాలు 24 గంటల్లోపు తిరిగి వస్తే రిటర్న్‌ ఫీజులో సగం రాయితీ విధానం అమల్లో ఉం డగా.. దీనిని కేంద్రం ఎత్తివేసింది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలకు మాత్రమే రాయితీ వర్తిస్తోంది. దీంతో ఫాస్టాగ్‌ లేని వాహనదారులు నగదు రూ పంలో చెల్లిస్తుండగా.. వీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. 24గంటల్లోపు వాహనం తిరిగి వచ్చినా.. మొత్తం టోల్‌ఫీజు చెల్లించాల్సి వస్తోంది. టోల్‌గేట్లకు సమీపంలో ఉండే గ్రామాల వారీ వాహనాలకు ఇచ్చే రాయితీ పాస్‌లకు కూడా ఫాస్టాగ్‌ తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్‌ లేకుంటే నెలసరి పాస్‌ రాయితీ ఎత్తేశారు. దీంతో 24 గంటల్లోపు తిరిగి వెళ్లే వాహనదారులు, స్థానికులు నష్టపోవాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫాస్టాగ్‌ చేసుకోవాల్సి వస్తోంది. 

నగదు చెల్లింపులకు ఒక్క లైన్‌ మాత్రమే

ఇక ఫాస్టాగ్‌ కోసం ప్రత్యేక లైన్లు ఉండగా.. ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం విడిగా 25శాతం లేన్లు ఉండేవి. ఫాస్టాగ్‌ వాహనాలతో పాటు నగదు చెల్లించే వాహనాలు కూడా వెళ్లేవి. జనవరి 14 అర్ధరాత్రితో  గడువు ముగియడంతో జనవరి 15 నుంచి టోల్‌ఫ్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లేన్‌ మాత్రమే నగదు చెల్లింపులకు కేటాయించారు. మూడు టోల్‌ గేట్లలో ఒక్కో వైపు ఒక లేన్‌ మాత్రమే నగదు చెల్లింపుల కోసం కేటాయించగా.. మిగతా లేన్లు పూర్తిగా ఫాస్టాగ్‌ కోసం కేటాయించారు. దిలావర్‌పూర్‌ టోల్‌గేట్‌ వద్ద నాలుగు లేన్లు ఉండగా.. ఇందులో వెళ్లేందుకు రెండు లేన్లు, వచ్చేందుకు రెండు లేన్లు ఉన్నాయి. మధ్యలో లేన్లు ఫాస్టాగ్‌ కోసం.. చివరి లేన్లు నగదు చెల్లింపులకు కేటాయించారు. 

యాప్‌లో రాని సమాచారం

ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ కొన్నిచోట్ల సాంకేతికపరమైన ఇబ్బందులతో వాహనదారులు నష్టపోవాల్సి వస్తోంది. ఫాస్టాగ్‌ కలిగిన వాహనదారులు టోల్‌చార్జికి సరిపోయే మొత్తం తమ ఖాతాల్లో ఉన్నప్పటికి కనీస నిల్వలు లేవని చెబుతున్నారు. నగదు ద్వారా చెల్లింపు చేయించుకొని.. తర్వాత వారి ఖాతా నుంచి కూడా టోల్‌ డబ్బులు కట్‌ చేస్తున్నారు. దీంతో వాహనదారులు రెండుసార్లు టోల్‌ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇటీవల కొందరు వాహనదారులకు ఇదే అనుభవం ఎదురైంది. అటు ఫాస్టాగ్‌ ఉన్న సంస్థ, ఇటు ఎన్‌హెచ్‌ఏఐ, టోల్‌ సిబ్బంది ఎవరికి వారు తప్పించుకోవడంతో వాహనదారులు నష్టపోవాల్సి వస్తోంది. తమ ఖాతా నుంచి ఎన్నిసార్లు టోల్‌ కట్‌ అయిందో అప్‌డేట్‌ సమాచారం యాప్‌లో రాకపోవడంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. 

ఈవిషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అధికారి తరుణ్‌కుమార్‌ను నమస్తే తెలంగాణ సంప్రదించగా.. ఫాస్టాగ్‌ లేని వారికి రాయితీ వర్తించదని, సింగిల్‌ ఎంట్రీ మాత్రమే ఇస్తారన్నారు. నగదు చెల్లించే వారికి.. 24గంటల్లోపు తిరిగి వచ్చినా రాయితీ ఉండదన్నారు. దిలావర్‌పూర్‌లో తక్కువ లేన్లు ఉన్నందున.. మధ్యలో రెండు లేన్లు ఫాస్టాగ్‌ కోసం పెట్టామని, చివర రెండు వైపులా లేన్లు నగదు చెల్లింపుల కోసం పెట్టామన్నారు. 


logo