శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 05, 2020 , 00:57:28

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నిర్మల్‌ టౌన్‌: రైతును రాజుగా చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.  కందులను కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. క్వింటాలుకు రూ. 5,800 మద్దతు ధర చెల్లిస్తున్నామని , రైతులు కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని కోరారు. కుభీర్‌, భైంసా, నిర్మల్‌లో ఇప్పటివరకు 3500 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారని వివరించారు. త్వరలో ముథోల్‌, తానూరులో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. 


సమ్మక్క సారలక్క జాతరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మంత్రి స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ జాతరగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికి ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజిగారి రాజేందర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, ము న్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, మార్కెట్‌ కమిటీ జిల్లా అధికారి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కోటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు. 


logo