బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 03, 2020 , 01:51:07

పాడి రైతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు

పాడి రైతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు
  • జిల్లా కేంద్రంలో రూ. 2.57కోట్లతో పాల శీతలీకేంద్రం ప్రారంభం
  • పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లోక భూమారెడ్డి

నిర్మల్‌ టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం పాడి రైతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర  పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లోక భూమారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ కాలనీలో రూ. 2కోట్ల 57లక్షలతో చేపట్టిన 10వేల లీటర్ల సామర్థ్యం గల పాల శీతలీకేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించడంతోనే రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తారన్న లక్ష్యంతో ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందన్నారు. సమైక్యా ఫెడరేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న సంఘాలకు ప్రభుత్వం నిధులను కేటాయించిన దాఖలాలు అంతంత మాత్రంగానే ఉండేవని అన్నారు. సమైక్యా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో  రూ. 140కోట్లతో నష్టాల్లో ఉన్న  సంస్థ ప్రస్తుతం   రూ. 51కోట్ల లాభాల్లో నడుస్తుందని తెలిపారు. మార్చి నాటికి వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే నిర్మల్‌, లక్షెట్టిపేట్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో పాల శీతలీకరణ కేంద్రాల ఉన్నతీకరణ పూర్తయిందన్నారు. 


నిర్మల్‌కు రూ. 4కోట్ల నిధులను మంజూరు  చేయగా.. 3.10కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు 5వేల పాల శీతలీకరణ జరుగుతుండగా.. ఈ కేంద్రం ఏర్పాటుతో పదివేల నుంచి 15వేల సామర్ద్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ప్రతి లీటరు పాలకు రూ. 4 ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులకు 2167పాడి పశువులను అందజేశా మని, ఎస్సీ,  ఎస్టీ రైతులకు 75శాతం సబ్సిడీపై, మిగతా రైతులకు 50శాతం సబ్సిడీ పాల శీతలీకేంద్రాల ద్వారా పాలను విజయడెయిరీ ద్వారా విక్రయిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్‌ మాట్లాడుతూ.. నిర్మల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రోత్సాహంతోనే జిల్లాలో పాల ఉత్పత్తికి మంచి అవకాశాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్‌ వేణు, నాయకులు మతిన్‌, పోశెట్టి, విజయ డైరీ అధికారులు దేవేందర్‌, శ్రీనివాస్‌, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 


logo