గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 03, 2020 , 01:39:52

‘సదర్మాట్‌'కు సరస్వతి నీరు

‘సదర్మాట్‌'కు సరస్వతి నీరు
  • ప్రధాన కాలువకు నీటి విడుదల
  • ఎమ్మెల్యే చొరవతో సమస్యకు పరిష్కారం
  • యాసంగి పంట చేతికందేవరకు సాగునీటికి ఢోకాలేదంటున్న అధికారులు

ఖానాపూర్‌ : సదర్మాట్‌ రైతులకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి యాసంగి పంట కోసం నీటిని ఆదివారం విడుదల చేసినట్లు డీఈ నరేశ్‌కుమార్‌, ఏఈ రవికుమార్‌నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖానాపూర్‌ సబ్‌ డివిజన్‌లోని సదర్మాట్‌ ప్రధాన కాలువకు అధికారులు 15 రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. గోదావరి ప్రవాహంపై ఆధారపడి సదర్మాట్‌ ప్రధాన కాలువ కొనసాగుతుండడంతో గోదావరిలో నీటిమట్టం తగ్గి, ప్రధాన కాలువకు కూడా నీటి కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఆయకట్టు రైతులు వరినాట్లు వేసుకునే పనిలో పడ్డారు. కాలువలో సరిపడేంత నీరు లేకపోవడం వరినాట్లు జరుగుతాయా, లేదా అన్న అందోళనలో రైతులు సదర్మాట్‌కు సాగునీరు శ్రీరాంసాగర్‌ నుంచి విడుదల చేయించాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్‌ను కలిసి ఇటీవల మొరపెట్టుకున్నారు. దీంతో ఆమె ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డికి రైతుల సమస్యలను వివరించి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో తగినంత నీరు ఉన్నందున వెంటనే సదర్మాట్‌కు నీరు విడుదల చేచియించాలని సూచించారు. 


ఆమె సూచన మేరకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నేరుగా కాకుండ సరస్వతి కెనాల్‌ వడ్యాల్‌ గ్రామం వద్ద ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటిని ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్కేప్‌ రెగ్యూలేటర్‌ ద్వారా ప్రతిరోజు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు ఆదివారం దగ్గరుండి ఎమ్మెల్యే సూచన మేరకు నీటిని విడుదల చేయించారు.  ప్రతిరోజూ 300 క్యూసెక్కుల నీరు సదర్మాట్‌ ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నామని, వరినాట్లతో పాటు, కలుపులు కూడా ఈ నీటితో పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా, సాగునీటి విషయంలో రైతులు ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని యాసంగి సీజన్‌లో రైతులు పండించే వరిపంట వారి చేతికి అందేవరకు సాగునీటిని విడుదల చేస్తామని ఏఈ రవికుమార్‌ తెలిపారు.  


logo
>>>>>>