బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 02, 2020 , 00:31:53

ఈ‘సారీ..’ నిరాశే

ఈ‘సారీ..’ నిరాశే
  • కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసుల నిట్టూర్పు
  • ఆర్మూర్‌-నిర్మల్‌- ఆదిలాబాద్‌ రైలు మార్గానికి నిధులేవి?
  • హైదారాబాద్‌ నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌ ఉసేదీ
  • వ్యక్తిగత ఆదాయ పన్ను ప్రతిపాదనలో మార్పులు
  • స్లాబులు మారినా.. వేతన జీవులకు నిరాశ










నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:కేంద్ర బడ్జెట్‌ మరోసారి జిల్లా ప్రజలను నిరాశ పర్చింది. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసులు నిట్టూరుస్తున్నారు.. కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ఆదాయ పన్ను పరిమితి పెంచడానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రస్తావన చేయకపోగా.. వేతన జీవులకు నిరాశ ఎదురైంది. కొత్త బడ్జెట్‌లో ఆదాయ పన్ను చెల్లింపులు రెండు విధానాలు అమలు చేయనున్నారు. పాతది, కొత్త విధానం అనేది పన్ను చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలి. కొత్త విధానంలో మారితే మినహాయింపులు ఉండవు. పాత విధానంలో పన్ను మినహాయింపులు కొనసాగుతాయి. ఆదాయ పన్ను స్లాబ్‌లను మూడు నుంచి ఆరు స్లాబ్‌లకు పెంచారు. 


0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.2.50 నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం ఆదాయ పన్ను ఉంటుంది. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు ఉంటే 20 శాతం, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉన్న వారు రూ.25 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానంలో 80సీ, 80డీ, ఎల్‌ఐసీ, హెచ్‌ఆర్‌ఏల రాయితీలు ఉండవు. స్టాండర్డ్‌ డిడక్షన్‌, బీమా ప్రిమియం, పీఎఫ్‌, పింఛన్‌ ఫండ్‌ల మినహాయింపులు ఉండవు. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. వీరు ఆదాయ పన్ను కింద వర్తించే రాయితీలు పొందడానికి అవకాశం ఉండదు. 


కారిడార్‌, రైల్వే లైను ఊసేదీ..!

నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు సంబంధించి.. జిల్లాలో జాతీయ రహదారి నంబరు 44 హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ 80 కిలోమీటర్ల మేర ఉంది. ఈ రహదారి పలు మండల కేంద్రాలు, గ్రామాల మీదుగా పోతుంది. ఈ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన నాయకులు పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ రహదారిపై పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు.. చదువుకున్న యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. మారుమూల, అటవీ, గిరిజన ప్రాంతాల్లోని యువతకు ఉపాధి లభిస్తే.. అభివృద్ధి చెందేందుకు ఆస్కారముంటుందని అంతా భావిస్తున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. జిల్లాలోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా పండించే పంట ఉత్పత్తుల పరిశ్రమలు వస్తే.. పంట ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుంది. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ కారిడార్‌ ఏర్పాటు గురించి ఉసే లేకపోవడంతో జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్లాలంటే మహారాష్ట్రలోని వివిధప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు గానూ 9 నుంచి 10 గంటల సమయం పడతుంది. 


నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ప్రస్తుతం బస్సు మార్గమే ఉంది. నిర్మల్‌ వాసులు ఆర్మూర్‌, కామారెడ్డి మీదుగా బస్సులో వెళ్లున్నారు. జిల్లా ప్రజలు హైదరాబాద్‌ వెళ్లేందుకు రైలుమార్గం  ఏర్పాటుకు 2009-10 రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌చెరు వరకు లైన్‌ మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం రూ.3771 కోట్లు భారీగా అవుతుండటంతో.. తక్కువ ఖర్చుతో ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ లైన్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు లైన్‌ వేస్తే అక్కడి నుంచి నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు రైలులో వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో  2017 బడ్జెట్‌లో ఆదిలాబాద్‌- ఆర్మూర్‌ లైన్‌కు మంజూరు లభించింది. లైన్‌ సర్వే నిర్వహించిన అధికారులు రూ.2990 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు వేశారు. ఈ రైల్వే లైన్‌కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని జిల్లా వాసులు ప్రతి బడ్జెట్‌లో ఎదురు  చూస్తున్నప్పటికీ.. తీవ్ర నిరాశే మిగులుతోంది. ఈ బడ్జెట్‌లో సైతం కేంద్ర ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ రైల్వే లైన్‌ ఎలాంటి నిధులు కేటాయించలేదు.


logo