సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 01, 2020 , 02:08:44

యాసంగి సాయం!

యాసంగి సాయం!

నిర్మల్‌/ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: అన్నదాతను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం డబ్బులు వస్తున్నాయి. ఇప్పటికే మూడు సీజన్లలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, తాజాగా నాలుగో సీజన్‌ డబ్బులను జమ చేస్తున్నది. జిల్లాలోని 19మండలాల్లో 428రెవెన్యూ గ్రామాలుండగా.. జిల్లాలో మొత్తం 4.65లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1.43లక్షల మంది రైతుల వివరాలు నమోదు చేసుకోగా.. వీరికి రైతుబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో 1.30లక్షల మంది రైతులకు రూ.187కోట్ల మేర చెల్లించారు. రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. మరో 13వేల మంది రైతులకు రూ.29కోట్ల మేర రావాల్సి ఉంది. సమారు 59వేల ఎకరాలకు రూ.5వేల చొప్పున చెల్లించాల్సి ఉంది. తాజాగా నాలుగో సీజన్‌లో భాగంగా ఎకరానికి రూ.5వేల చొప్పున యాసంగి పంట సాగుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు విధులు చేసింది. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న సుమారు 1.57లక్షల మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జూన్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం 1.57లక్షల మంది రైతుల వద్ద 4.12లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇందుకోసం రూ.206కోట్లు అవసరమవుతున్నాయి.


జూన్‌ 10వరకు వివరాల అప్‌లోడ్‌ 

జిల్లాలో రైతులు, భూములకు సంబంధించిన వివరాలను జూన్‌ 10వరకు అప్‌లోడ్‌ చేశారు. ఆ తర్వాత జిల్లాలో భూములు చాలా వరకు క్రయవిక్రయాలు జరిగాయి. మరోవైపు కొందరు రైతులు తమ భూములను భాగాలుగా చేసి.. వారసుల పేరిట పట్టాలు చేయించారు. దీంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పూర్తయినప్పటికీ.. రెవెన్యూశాఖ నుంచి వ్యవసాయశాఖకు పంపాల్సి ఉంది. రైతుబంధు పథకం వర్తించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే.. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయనున్నారు. రైతుబంధు లాగిన్‌ ఓపెన్‌ కాగానే.. ఈ వివరాలు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మరో పదివేల మంది రైతులు, 50వేలకు పైగా ఎకరాల భూములు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో నమోదైన భూముల వివరాల ప్రకారం.. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు డబ్బులు ట్రెజరీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతోంది. ఇప్పటికే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా.. విడతల వారీగా డబ్బులను జమ చేస్తున్నారు. 


ఎకరానికి రూ.5వేల చొప్పున ఖాతాల్లో జమ

జిల్లాలో రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేస్తోంది. గతంలో ఎకరానికి రూ.4వేల చొప్పున.. రెండు విడుతల్లో కలిపి రూ.8వేల చొప్పున చెల్లించారు. 2018, మే 10న రైతుబంధు పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే మూడు విడతల్లో డబ్బులు చెల్లించారు. గత ఏడాది మే, జూన్‌ నెలల్లో తొలి సీజన్‌లో రైతుబంధు చెక్కులు రైతుల చేతికి అందజేయగా.. ఆ తర్వాత యాసంగి డబ్బులను అక్టోబరు, నవంబరు 2018లో, వానాకాలం సీజన్‌ డబ్బులను మే, జూన్‌ 2019లో రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2018, 2019లో వరుస ఎన్నికలు రావడంతో.. కోడ్‌ కారణంగా చెక్కులు కాకుండా.. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. తాజాగా 2020 యాసంగినకి  సంబంధించిన డబ్బులను కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతంలో ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు విడతలుగా ఏడాదికి రూ.8వేల చొప్పున ఇవ్వగా.. 2019 వానాకాలంలో, ప్రస్తుత యాసంగి (2020) సీజన్‌లకు మాత్రం రెండు విడుతలుగా ఎకరానికి ఏడాదికి రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. రైతులకు ప్రతి సీజన్‌లో పెట్టుబడి సాయం అందిస్తుండడంతో సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo