శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 01, 2020 , 02:07:41

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో ప్రాక్టికల్‌ మార్కులు ఎంతో కీలకంగా మారడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పరిసరాల్లో144 సెక్షన్‌ అమలుచేయనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు నిఘా (సీసీ కెమెరాల పర్యవేక్షణలో) నీడలో నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలకు మాత్రమే పరీక్షా కేంద్రాలను కేటాయించారు.


పారదర్శకంగా పరీక్షల నిర్వహణ

ప్రాక్టికల్‌ పరీక్షలను అధికారులు పారదర్శంగా నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాకు హైపర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుగా ఉన్నారు. కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ ఎం.ప్రశాంతి, వైస్‌ చైర్మన్‌గా ఎస్పీ శశిధర్‌ రాజు, కన్వీనర్‌గా ఇంటర్‌ మీడియట్‌ నోడల్‌ ఆఫీసర్‌ అలెగ్జాండర్‌, సభ్యులుగా లెక్చరల్‌, ప్రిన్సిపాల్‌ ఉన్నారు. వీరు నిత్యం పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. జిల్లాలో ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అనుకూలంగా,ఇంటర్‌ నెట్‌, సీసీ కెమెరాలు 

ఉన్న కళాశాలలను ఎంపిక చేశారు. 


కమిషనర్‌ కార్యాలయానికి అనుసంధానం

కళాశాలల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ప్రాక్టికల్స్‌ పరీక్షలను ఇంటర్‌నెట్‌ అనుసంధానంతో నేరుగా మాద్యమిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులు పర్యవేక్షిస్తారు.అరగంట ముందుగానే సంబంధిత కళాశాలలకు ఆన్‌లైన్‌లో పరీక్షా ప్రశ్నాపత్రాన్ని పంపిస్తారు.దీన్ని నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ముగిసిన వెంటనే పేపర్లను దిద్ది విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.


ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు...

జిల్లాలోని మొత్తం 30 జూనియర్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో 12 ప్రభుత్వ కళాశాలలు,3 సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు,1 టీఎస్‌ఆర్‌జేసీ, 1 మోడల్‌ కళాశాల, 13ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించగా మొత్తం 5992 మంది విద్యార్థులు  పరీక్షలకు హాజరుకానున్నారు.ఇందులో ఎంపీసీ విద్యార్థులు 3828, బైపీసీ 2164 మంది,వోకేషనల్‌ 700 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్షలను నిర్వహించనున్నారు.ఇందుకోసం 13 మంది డిపార్ట్‌ మెంట్‌ అధికారులు, 30మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులను నియమించారు. logo