బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Jan 31, 2020 , 03:31:35

సత్వర న్యాయం.. సర్వత్రా హర్షం

సత్వర న్యాయం.. సర్వత్రా హర్షం
  • 45 రోజుల్లోనే ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు
  • తప్పు చేసే వారికి తగిన గుణపాఠమనే అభిప్రాయం
  • నిందితులకు సరైన శిక్ష అంటున్న జనం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : కుమ్రంభీం జిల్లా జైనూర్‌లో ఉంటూ పరిసర గ్రామాల్లో  బోళ్లు అమ్ముకుంటూ ఉపాధి పొందే సమత గతేడాది నవంబరు 24న లింగాపూర్‌ మండలం ఎల్లపటార్‌ గ్రామానికి వెళ్లింది. బోళ్లు అమ్ముకుని తిరిగివస్తుండగా రాంనాయక్‌ తండా వద్ద కాపుకాసిన ఎల్లపటార్‌కు చెందిన మూడు మానవమృగాలు షేక్‌ బాబు(30), షేక్‌ షాబొద్దీన్‌ (40), షేక్‌ మగ్దూం(35) సమతను అడ్డగించి పొదల్లోకి తీసుకుపోయి లైంగికదాడికి పాల్పడ్డారు.  బాధితురాలు విషయం బయటపెడుతుందనే అనుమానంతో ఆమెను కత్తితో పొడిచి హత్యచేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు సమత మృతదేహాన్ని ఎల్లపటార్‌ శివారులో కనుగొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మగ్దూంలను అరెస్ట్‌ చేశారు . నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పలు చోట్ల ఆందోళన లు జరిగాయి. సమత కేసును తీవ్రంగా పరిగణించిన ప్రభు త్వం డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన 20 రోజుల్లో డిసెంబర్‌ 14న పోలీసులు కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు పని రోజుల్లో రోజు వారీ విచారణ కొనసాగింది. ప్రత్యేక కోర్టులో కేసు విచారణ డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభంకాగా 45 రోజుల్లో ఈ నెల 30న తీర్పు వెలువడింది.


సర్వత్రా హర్షం

సమత కేసులో సత్వర తీర్పు వెలువడడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో దిశ ఘటన నేపథ్యంలో సమత కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని రాష్ట్రంతో పాటు జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి ఉరిశిక్ష విధించడంతో సంచలన తీర్పుగా మా రింది. సమతా కేసులో సత్వర తీర్పు వెలువడడంతో ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమతను పాశవికంగా హత్య చేసిన నిందితులకు ఉరి సరైన శిక్ష అని.. ఎవరూ కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా  శిక్ష వారికి గుణపాఠం నేర్పుతుందనే పలువురు అంటున్నారు. ఈ తీర్పు సమాజం గెలుపుగా పీపీ రమణారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాసిక్యూషన్‌ తరఫున బలమైన వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.  కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి తాము రాసిన లేఖపై స్పం దించి మూడ్రోజుల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందని తాను శాస్త్రీయంగా సాక్షాలను కోర్టుకు సమర్పించడంతో పాటు సాక్షులను ప్రవేశపెట్టామని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. 


బుడగ జంగం నాయకుల హర్షం

సమత కేసు నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించడంపై బేడ బుడగ జంగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కోర్టులో విచారణ కొనసాగగా సమత భర్తకు అండగా సంఘం నాయ కులు కోర్టుకు వచ్చారు. నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇవ్వగా.. వారు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో విజయ సంకేతాలు చూపి స్తూ న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కేసు సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభు త్వం ఫాస్ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి తక్కువ కాలంలో తీర్పు రావడం అభినందనీయమని కొనియా డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించిందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పస్తుల పావులు, టేకుల ప్రకాశ్‌, తిరుపతి, మధు, గంగాధర్‌, పవన్‌, సంతోష్‌ ఉన్నారు. 


కొవ్వొత్తుల ర్యాలీ

ఎదులాపురం : సమత కేసు నిందితులకు విధించిన ఉరి శిక్షణ సరైందని రామ్‌నగర్‌ కౌన్సిలర్‌ తూర్పటి సుజాత భూమన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్‌లోని సవారీబంగ్లా వద్ద సమత చిత్రపటానికి పులమాల వేసి కాలనీ వాసులు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమతకు జరిగిన అన్యాయాన్ని పుడ్చలేము కాని కేసు నిందితులకు ఉరిశిక్ష విధించి న్యాయాన్ని గెలిపించా రన్నారు.  కార్యక్రమంలో  భూమన్న, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపుప్రభాకర్‌ రెడ్డి, కాలనీ వాసులు ఉన్నారు.


ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో.. 

 సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు సంతోషకరమని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్‌ అన్నారు. గురువారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలో పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమత నిందితులను వెంటనే ఉరి తీయాలన్నారు.  జిల్లా అధ్యక్షుడు జాషువా, కౌన్సిల్‌ సభ్యులు అముల్‌ రాజ్‌, ప్రవీణ్‌ కుమార్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.logo