మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 31, 2020 , 03:25:00

‘సహకార’ సమరానికి సై

‘సహకార’ సమరానికి సై
  • సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
  • 15వ తేదీన పోలింగ్‌..అదేరోజు ఫలితాల వెల్లడి
  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌..
  • పాత సంఘాల ప్రకారమే ఎన్నికల నిర్వహణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌  జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. ఇందులో నిర్మల్‌ జిల్లాలో 17, ఆదిలాబాద్‌ జిల్లాలో 28, మంచిర్యాల జిల్లాలో 20, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. నిర్మల్‌ జిల్లాలో 16 పీఏసీఎస్‌లు, ఒక రైతు సేవా సహకార సంఘం ఉంది. ఉమ్మడి జిల్లాలో పీఏసీఎస్‌లకు 2013, ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగగా.. ఫిబ్రవరి 4న పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రతి సహకార సంఘానికి 13మందితో పాలకమండళ్లు ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాలకు గడువు ముగియగా.. ప్రతి ఆరు నెలలకొకసారి పర్సన్‌ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని పొడగిస్తూ వస్తున్నది. ఇప్పటికే మూడుసార్లు పదవీకాలం పొడగించగా.. తాజాగా వచ్చేనెల 4వ తేదీన పదవీ కాలం ముగియనుంది. 


దీంతో సీఎం కేసీఆర్‌ సహకార ఎన్నికల ఏర్పాట్లపై నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సహకార ఎన్నికల నిర్వహణకు సహకారశాఖ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 3న ఫాం నెంబరు-1 నోటీసును జారీ చేయనున్నారు.  6, 7, 8తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన చేపడుతారు. 10న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 15న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి.. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. అనంతరం ఈ ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లు మూడు రోజుల్లోపు పరోక్ష పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం డీసీసీబీ పాలకవర్గానికి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్‌ను జారీ చేస్తారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా డీసీసీబీ పాలకవర్గాలు ఉండనున్నాయి. డీసీసీబీలో 21మంది డైరెక్టర్లు ఉండగా.. వీరిని పీఏసీఎస్‌ చైర్మన్లు ఓటు వేసి ఎన్నుకుంటారు. 21మంది డైరెక్టర్ల నుంచి ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్‌ చైర్మన్‌గా పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. 


పాత సంఘాలకే ఎన్నికలు

జిల్లాలో 77 పీఏసీఎస్‌లు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌లుండగా.. అదనంగా కొత్తగా మరో 68 పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం మాత్రం పాత సంఘాల ప్రకారమే సహకార ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. నిర్మల్‌ జిల్లాలో 17 సంఘాలుండగా.. 34,303మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 28 సంఘాలుండగా.. 46,756మంది సభ్యులున్నారు. మంచిర్యాల జిల్లాలో 20 సహకార సంఘాలుండగా.. 23,056మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12 పీఏసీఎస్‌లుండగా.. 18,167మంది రైతులు ఓటర్లుగా నమోదయ్యారు. సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే పాలకవర్గాల్లో ఉన్న వారితో పాటు కొత్త వారు కూడా డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం పోటీ పడుతున్నారు. మరో మూడు వారాల పాటు జిల్లాలో సహకార ఎన్నికల సందడి కొనసాగనుంది. 


నిర్మల్‌ జిల్లాలో సహకార సంఘాలు...

కుభీర్‌, కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్‌ మండలం ముక్తాపూర్‌, మంజులాపూర్‌ (ప్రస్తుతం నిర్మల్‌ మున్సిపాలిటీలో విలీనం), సారంగాపూర్‌ మండలం ఆలూర్‌, కౌట్ల(బి), ముధోల్‌ మండలం బిద్రెల్లి, తానూర్‌ మండలం హంగిర్గా, దిలావర్‌పూర్‌ మండలం బన్సపెల్లి, ఖానాపూర్‌ మండలం సత్తెనపల్లి, ఖానాపూర్‌, కడెం మండలం పాండ్వాపూర్‌, భైంసా మండలం మిర్జాపూర్‌.. నిర్మల్‌లో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ లో ఉన్నాయి.


logo
>>>>>>