బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Jan 30, 2020 , 01:25:12

అటవీశాఖలో కలకలం!

అటవీశాఖలో కలకలం!

ఖానాపూర్‌: అటవీశాఖలో సత్తెనపల్లి డిప్యూటీ రేంజర్‌ జ్యోతి సస్పెన్షన్‌ కలకలం రేపుతున్నది. కలప అక్రమ తరలింపు కేసులో రెండు రోజుల క్రితం ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో ఖానాపూర్‌ అటవీశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా కన్జర్వేటర్‌, కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అడవుల్లో నిఘా పెంచారు.ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశారు. కలప విషయంలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందితో నిర్వహించిన సమావేశాల్లో పలుమార్లు హెచ్చరించారు. అప్పటి నుంచి ఏడాది కాలంగా ఖానాపూర్‌ ప్రాంతంలో కలప అక్రమ తరలింపు దాదాపుగా నిలిచిపోయింది. తాజాగా కలప అక్రమ తరలింపులో శాఖ ఉద్యోగి పాత్ర ఉండడంతో సీపీ వినోద్‌కుమార్‌ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో సత్తెనపెల్లి డిప్యూటీ రేంజర్‌పై సస్పెన్షన్‌వేటు వేశారు. అటవీ రక్షణలో భాగంగా అటవీశాఖ అడవుల చుట్టూ కందకాల తవ్వకాలు జరుపుతున్నది.తవ్వకాల్లో అక్కడక్కడా టేకు చెట్లు పడిపోతున్నాయి.కలపను వాస్తవానికి ఖానాపూర్‌లోని కలప లాగింగ్‌ డిపో(అటవీశాఖ వేలం ద్వారా కలపను విక్రయించే కేంద్రం)కు తరలించాలి. సత్తెనపెల్లి డిప్యూటీ రేంజర్‌గా ఉన్న జ్యోతి అలా చేయకుండా కందకాల్లో పడిపోయిన టేకు చెట్లను రేంజ్‌ పరిధిలో నడింపల్లె గ్రామానికి చెందిన ఒక వడ్రంగి ఇంటికి కలప సైజులు కోయడానికి పంపినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో సదరు ఉద్యోగినిని సస్పెన్షన్‌ చేయడం అటవీశాఖలో తీవ్ర కలకలం రేపుతున్నది. కలప అక్రమ తరలింపులో ఇంకా లోతుగా విచారణ జరుపుతామని సీపీ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోని స్పష్టం చేశారు. జ్యోతి సస్పెన్షన్‌కు గురికాగా, ఆమె స్థానంలో ఖానాపూర్‌ డీఆర్వో  రత్నాకర్‌రావును ఇన్‌చార్జిగా నియమించారు.


logo