మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 29, 2020 , 00:16:16

గులాబీ.. ఓట్ల సునామీ

గులాబీ.. ఓట్ల సునామీ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగింది.. సీట్లలోనే కాదు.. ఓట్లలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ అదే దూకుడు ప్రదర్శించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలుండగా.. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ 1/70యాక్ట్‌ అమలులో ఉండడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. 11 మున్సిపాలిటీల్లో ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించగా 25న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11 మున్సిపాలిటీలకుగాను పదిచోట్ల టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడింది. పది మున్సిపాలిటీల్లోనూ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోగా.. భైంసాలో మాత్రం ఎంఐఎం పుర పీఠాన్ని కైవసం చేసుకుంది.

182 వార్డులు కైవసం 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 309వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌ 182వార్డులను దక్కించుకొని 58.90శాతం సాధించింది. ఖానాపూర్‌లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఈ సంఖ్య 183కు చేరింది. ఇక కాంగ్రెస్‌ 51స్థానాలతో 16.50శాతం సీట్లను సాధించింది. బీజేపీ, స్వతంత్రులు చెరో 25స్థానాలు దక్కించుకోగా.. 8.09శాతం సీట్లను గెలుచుకున్నారు. ఎంఐఎం 22వార్డులను గెలుచుకొని 7.12శాతం సీట్లను దక్కించుకుంది. మరో నాలుగు చోట్ల ఇతరులు గెలువగా.. 1.29శాతం సీట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, తెలంగాణ జన సమితి అసలు బోణీ చేయలేదు. 

గులాబీ జోష్‌!

టీఆర్‌ఎస్‌ పార్టీ సీట్లలోనూ కాకుండా ఓట్లలోనూ దూసుకుపోయింది. గులాబీ పార్టీకి గంపగుత్తగా ఓ ట్లు పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో 11 పురపాలక సంఘాల్లో మొత్తం 309వార్డులుండగా.. 13వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పది వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. మరో మూడు వార్డులను ఎంఐఎం తన ఖాతాలో ఏకగ్రీవంగా వేసుకుంది. చెన్నూర్‌లో 7, నిర్మల్‌లో 2, బెల్లంపల్లిలో 1 వార్డు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోగా..  భైంసాలో ఎంఐఎం 3వార్డులను ఏకగ్రీవంగా గెలిచింది. దీంతో 296వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 5,52,082మంది ఓటర్లుండగా.. ఈ నెల 22న జరిగిన పోలింగ్‌లో 3,79,814 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి అత్యధికంగా 1,57,190మంది ఓటు వేశారు. 41.39శాతం ఓట్లను దక్కించుకుంది. ఒక్క భైంసా తప్పా మిగతా 10 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ  80,631ఓట్లను మాత్రమే సాధించింది. 22.23శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది. చెన్నూరు, భైంసాల్లో కాంగ్రెస్‌కు సీట్ల పరంగా బోణీ కాకపోగా.. ఓట్ల పరంగా కూడా ఏమాత్రం రాణించలేకపోయింది. చెన్నూర్‌లో కేవలం 332ఓట్లు రాగా.. భైంసాలో 1220ఓట్లకే పరిమితమైంది. క్యాతన్‌పెల్లిలో 2159ఓట్లు మాత్రమే వచ్చాయి. 

ఇక బీజేపీ 54,107ఓట్లను మాత్రమే దక్కించుకోగా.. 14.25శాతం ఓట్లకే పరిమితమైంది. లక్షెట్టిపేట్‌లో 849ఓట్లు రాగా.. చెన్నూర్‌లో 1312, క్యాతన్‌పెల్లిలో 1363, ఖానాపూర్‌లో 1322ఓట్లకే పరిమితమైంది. ఒక్కచోట వెయ్యిలోపు, మూడుచోట్ల 1500లోపు ఓట్లకే పరిమితమైంది. సీట్ల పరంగా ఆరు మున్సిపాలిటీల్లో మంచిర్యాల, చెన్నూర్‌, లక్షెట్టిపేట్‌, క్యాతన్‌పెల్లి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో అసలు బోణీయే చేయలేదు. ఎంఐఎం 23,396ఓట్లు రాగా.. 6.16శాతం ఓట్లను సాధించింది. నస్పూర్‌, లక్షెట్టిపేట్‌, క్యాతన్‌పెల్లిలో పోటీ చేయకపోగా.. ఖానాపూర్‌లో 12ఓట్లు, మంచిర్యాలలో 151ఓట్లు, బెల్లంపల్లిలో 41, కాగజ్‌నగర్‌లో 453ఓట్లు మాత్రమే వచ్చాయి. భైంసా, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో మాత్రం సీట్లతో పాటు కొంత మేర ఓట్లను కూడా సాధించింది. ఇతర పార్టీలు 9,211ఓట్లను సాధించగా.. 2.43శాతం ఓట్లు పడ్డాయి. స్వతంత్రులు 47,500ఓట్లు రాగా.. 12.51శాతం ఓట్లను సాధించారు. నోటాకు 1,966ఓట్లు రాగా.. 0.52శాతంగా ఉంది. చెల్లని ఓట్లు 5,813 ఉండగా.. 1.53శాతంగా నమోదైంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెండింటికి కలిపి 11 మున్సిపాలిటీల్లో 36.48 శాతం ఓట్లు రాగా.. ఒక్క టీఆర్‌ఎస్‌కే 41.39శాతం ఓట్లు వచ్చాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన పది వార్డులు వేరుగా ఉండనే ఉన్నాయి. ఈ లెక్కన రెండు పార్టీలకంటే టీఆర్‌ఎస్‌కు ఐదుశాతం అధికంగా ఓట్లు వచ్చాయి. 


logo
>>>>>>