శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 29, 2020 , 00:16:54

వసంత పంచమికి బాసర ముస్తాబు

వసంత పంచమికి బాసర ముస్తాబు

బాసర : దక్షిణ భారతదేశంలో అత్యంత మహిమాన్విత క్షేత్రంగా జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయం వెలుగొందుతుంది. భారత యుద్ధాన్ని చూసి చలించిన వ్యాస మహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుంచి  నేటి వరకూ  సరస్వతీ అమ్మవారు విశేష పూజలందుకుంటున్నది. బాసర ఆలయం దినదిన ప్రవర్థమానం చెందుతూ అఖండ కీర్తితో అలరారుతున్నది. నిత్యం వేలాది మంది భక్తులు  దర్శించుకుంటున్నారు. వందల మందికి చిన్నారులకు అక్షర శ్రీకార పూజాలు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోలేని విద్యార్థులు లేరంటే అతిశయోక్తే అవుతుంది. ఈ నెల 30న ఇక్కడి వసంత పంచమి వేడుకలు నిర్వహించనుండగా, మంగళవారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

క్షేత్రం ప్రాశస్త్యం

వ్యాసమహర్షి బ్రహ్మాండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిన అవసరం ఏర్పడింది. శక్తిని వర్ణించాలంటే మరింత తపోశక్తితో పాటు ఎలాంటి అంతరాయం లేని మహిమ గల ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి బాసర (జాహ్నావి తీరం) చేరుకున్నారు. ఇదీ గోదావరి నాబీ స్థానం. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదావరి నాబీ స్థానం అంటారు. బ్రహ్మేశ్వరం లోకేశ్వరం మండలం కన్కాపూర్‌లో ఉంది. ఇది అప్పటికే పుణ్య స్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడానికి ఆగాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయనకు శక్తి రూపంలో నీడలా కనిపించి వెను వెంటనే మాయమైంది. దీంతో ఆ రూపం ఎవరిదా అని తన దివ్య దృష్టితో చూడగా జ్ఞాన సరస్వతీ అమ్మవారు కనిపించారు. పూర్తి రూపం కనిపించకపోవడానికి కారణం అడిగాడు. భూలోకంలోని కొన్ని పాప కార్యాల కారణంగా తన పూర్తి రూపాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు చెప్పారు. ప్రతి రోజు గోదావరిలో ధ్యానం చేసి పిడికెడు ఇసుకను నచ్చిన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుకతో తన పూర్తి రూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతీగా అందరికీ దర్శనమిస్తానని అమ్మవారు తెలిపినట్లు పురాణాల్లో ఉంది. వ్యాసుడు గోదావరి తీరాన కొంత దూరంలో ఉన్న కుమారదర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు. అమ్మవారు చెప్పినట్లు ఇసుకను తీసుకవచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించారు. ఇలా కొన్నేండ్లు గడిచిన అనంతరం అమ్మవారి రూపం పూర్తి కావడం ఆమె జ్ఞాన సరస్వతీగా ఆవిర్భవించినట్లు పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతీ దేవి ఆయనకు జ్ఞాన బీజాన్ని ఉపదేశించారు. జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందుతున్నది. దేశంలోని కాశ్మీర్‌, కన్యాకుమారిల్లో సరస్వతీ ఆలయాలు ఉన్నా చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ బాసరలోనే ఉందని పెద్దలు చెబుతుంటారు. ఒక సరస్వతీ దేవినే ప్రతిష్టించడం సబబు కాదని అమ్మవారికి తోడుగా మహాకాళి, మహాలక్ష్మీలను ప్రతిష్టించారు. ముగ్గురు మాతలు పక్కపక్కనే ఉండడం దేశంలో మరెక్కడా లేదు. ఈ అరుదైన దృశ్యం ఒక బాసరలోనే ఉండడం ఈ క్షేత్రానికి మరింత ప్రాధాన్యం చేకూరింది. 


ఆలయ నిర్మాణం ఇలా.. 

బాసరలోని సరస్వతీ దేవి, ఇతర ఆలయాలను చోళ రాజులే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చోళ రాజుల కాలంలో బాసర ఒక మండలం. వీరు వ్యాసుడు ప్రతిష్టించిన సరస్వతీ దేవి విగ్రహానికి 16 స్తంభాల గుడి కట్టించారు. కోనేరుకు శాశ్వత నిర్మాణం చేశారు. బాసరలో పూజలు చేసిన దేవుళ్ల పేరును కుకటేశ్వర ఆలయం, సూర్యేశ్వర ఆలయం, వెంకటేశ్వర ఆలయం, చింతామణి గణేశ్‌ మందిరం, పాపహరేశ్వర ఆలయం, దత్తాత్రేయ మందిరం నిర్మించారు. వీరు నిర్మించిన ప్రతి మందిర ధ్వజ స్తంభాలపై వారి శాసనాలు ఉన్నాయి. ఇతర రాజులు పాలనతో ఈ ఆలయం విశేషాలు అంతగా లభించలేదు. వ్యాపారులు రహస్యంగా తన ధనాన్ని తీసుకువెళ్లడానికి దత్తాత్రేయ మందిరం నుంచి గ్రామ చివరన ఉన్న పాపహరేశ్వర ఆలయం వరకు సొరంగ మార్గం నిర్మించినట్లు ఉంది. సరస్వతీ దేవి, మహాలక్ష్మి, మహాంకాళిలను వ్యాసుడు ప్రతిష్టించాలని నిర్ణయించారు. దీంతో కోనేరు ఆలయానికి ఆగ్నేయ దిశకు వచ్చింది. పండితులు అమ్మవారు ప్రతిష్ఠించడానికి నిర్ణయించిన ముహూర్తానికి కేటాయించిన స్థలంలో పూజలు ప్రారంభించారు. పూజ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను మందిరంలోని వేరే ప్రదేశంలో ఏర్పాటుచేశారు. పూజలు పూర్తి కాకపోవడంతో వేరే ప్రాంతంలో పెట్టిన విగ్రహాలను అక్కడే ఉండిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఇక్కడ ఒక ఆలయం కట్టించారు. సరస్వతీ విగ్రహానికి ఎదురుగా నమస్కరిస్తున్న భంగిమలో మక్కాజీ పటేల్‌ విగ్రహం ఉంది. ఆ తర్వాత వచ్చిన వారు దీన్ని గర్భగుడి పక్కన బయట పెట్టారు. 


logo