శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 29, 2020 , 00:06:15

నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి

నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : జిల్లాలో నేరాల నియంత్రణ, అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పోలీసు గస్తీ, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని  ఎస్పీ శశిదర్‌ రాజు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసులతో నెల వారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని,  ప్రజా ఫిర్యాదులో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో నేరాలు అదుపులో ఉన్నాయని, ప్రజలకు పోలీసులపైన ఎంతో విశ్వాసం పెరిగిందన్నారు. ఇందుకు కారణమైన పోలీసు అధికారులను అభినందించారు. ముఖ్యంగా గంజాయి, గుట్కా, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు నిత్యం తనిఖీలను విస్తృతం చేయాలన్నారు. షీటీమ్‌ల ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధినిర్వహణలో పోటీపడి నేరాలను తగ్గుముఖం పట్టించేందుకు కృషి చేయాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేక చొరవతో కాలనీలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ప్రధాన కూడల్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇతర మతాలు, వ్యక్తులను కించపర్చే విధంగా ఎలాంటి అసభ్యకరమైన పోస్టింగ్‌లు కామెంట్స్‌, లైక్‌లు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సామాజిక మాద్యమాల్లో పంపినటు వంటి వ్యక్తులపైన చట్టరిత్యా చర్యలు ఉంటాయని అన్నారు.  సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాస్‌ రావు, వెంకట్‌ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, నర్సింగ్‌ రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌బీ సీఐ వెంకటేశ్‌, సీఐలు జాన్‌దివాకర్‌ , జీవన్‌ రెడ్డి, జైరాం  ప్రవీణ్‌ కుమార్‌, జిల్లాలోని ఎస్సైలు తదితరులున్నారు. logo