ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 28, 2020 , 00:43:02

కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు

కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు
  • నిర్మల్‌, ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ కైవసం
  • భైంసా మున్సిపాలిటీలో మరోసారి ఎంఐఎం
  • పురపాలికల్లో ప్రత్యేకాధికారుల పాలనకు తెర

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పురపాలక సంఘాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గాలు ఎన్నికయ్యాయి. సోమవారం ఉదయం 11గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 2.30గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలుండగా నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటించారు. సోమవారం మూడు మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరాయి. ఉదయం 11గంటలకు మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12.30గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్‌ ఎం.ప్రశాంతి పర్యవేక్షణలో మూడు చోట్ల ప్రత్యేకాధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు. భైంసాలో ప్రత్యేకాధికారిగా ఉన్న జేసీ ఎ.భాస్కర్‌రావు, నిర్మల్‌లో ప్రత్యేకాధికారిగా ఉన్న జడ్పీ సీఈవో సుధీర్‌, ఖానాపూర్‌లో ప్రత్యేకాధికారిగా ఉన్న ఆర్డీవో ప్రసూనాంబ.. ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించారు. కౌన్సిలర్లు చేతులెత్తి చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. మూడు చోట్ల కూడా ప్రశాంతంగానే ముగిశాయి. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉండగా.. రెండు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ పుర పీఠాలను దక్కించుకుంది. నిర్మల్‌, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో పుర పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో ఒక్క చోట ఎంఐఎం పురపీఠాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకుంది. 


చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు వీరే..

నిర్మల్‌లో మున్సిపల్‌ చైర్మన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌(టీఆర్‌ఎస్‌), వైస్‌ చైర్మన్‌గా షేక్‌ సాజిద్‌ (టీఆర్‌ఎస్‌), ఖానాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా అంకం రాజేందర్‌(టీఆర్‌ఎస్‌), వైస్‌ చైర్మన్‌గా అబ్దుల్‌ ఖలీల్‌(టీఆర్‌ఎస్‌) ఎన్నికయ్యారు. భైంసా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా సబియా బేగం(ఎంఐఎం), వైస్‌ చైర్మన్‌గా జాబీఆర్‌ అహ్మద్‌(ఎంఐఎం)లు ఎన్నికయ్యారు. 


మూడు చోట్ల ఏకగ్రీవంగానే ఎన్నిక!

నిర్మల్‌ మున్సిపాలిటీలో 42వార్డులకుగాను.. టీఆర్‌ఎస్‌ 30వార్డులు గెలిచింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నమోదు చేసుకోవడంతో.. టీఆర్‌ఎస్‌ బలం 31కి చేరింది. ఇక్కడ ఏకగ్రీవంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. ఖానాపూర్‌లో 12వార్డులకుగాను.. టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 5, బీజేపీ 1, స్వతంత్రులు ఒక్కో వార్డు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి తొంటి శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరి మద్దతు ఇవ్వగా, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యురాలుగా నమోదు చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ బలం ఏడుకు చేరింది. కాంగ్రెస్‌ సభ్యురాలు కారింగుల సంకీర్తన గైర్హాజరు కావడంతో కాంగ్రెస్‌ బలం నాలుగుకు తగ్గిపోయింది. దీంతో ఇక్కడ కూడా ఏకగ్రీవంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఎన్నికయ్యారు. భైంసాలో 24వార్డులకుగాను ఎంఐఎం 15వార్డులను గెలుచుకోగా.. ఏకగ్రీవంగానే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కించుకుంది. ప్రమాణస్వీకారం తర్వాత 11మంది బీజేపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. కోరం ఉండడంతో.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించగా.. ఎంఐఎం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


ప్రత్యేక పాలనకు తెర

నిర్మల్‌, భైంసాల్లో 2014 ఏప్రిల్‌లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించగా.. జూన్‌లో ఫలితాలు ప్రకటించారు. 2014, జూలై 1న పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేయగా.. 2019జూలై 1న అయిదేళ్ల పదవీకాలం పూర్తయింది. దీంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సుమారు ఏడు నెలల ప్రత్యేకాధికారుల పాలనకు సోమవారంతో ముగిసింది. ఇక ఖానాపూర్‌ మున్సిపాలిటీ ఆగస్టు 2, 2018న ఆవిర్భవించగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉండగా.. తాజాగా కొత్త పాలకవర్గం వచ్చింది.


నిర్మల్‌లో తొలిసారి..  ఖానాపూర్‌లో తొలిపీఠం

నిర్మల్‌ చరిత్రలో మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ తొలిసారిగా జెండా ఎగుర వేసింది. 1952లో నిర్మల్‌ మున్సిపాలిటీ ఏర్పడగా.. తొలిసారిగా గులాబీ జెండా రెపరెపలాడింది. 2001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. 2005 నుంచి పుర ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తొలిసారిగా పురపీఠాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నాయకత్వంలో దక్కించుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. మున్సిపాలిటీని కూడా బీఎస్పీ నుంచి గెలిపించుకున్నారు. బీఎస్‌ఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశాక.. మున్సిపాలిటీ పాలక వర్గం కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుగానే కొనసాగింది. కారు గుర్తుపై గెలిచి.. పురపీఠాన్ని దక్కించుకోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏడాదిన్నర క్రితం కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీపై తొలి పీఠాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే వ్యక్తి రెండు సార్లు మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేయలేదు. ఒక కుటుంబం నుంచి పని చేసినా.. ఒక్కరే రెండు సార్లు మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేయలేదు. తాజాగా మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన గండ్రత్‌ ఈశ్వర్‌ మాత్రం రెండో సారి కావడం నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో 2000నుంచి 2005వరకు చైర్మన్‌గా పని చేయగా.. తాజాగా రెండో సారి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. భైంసా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా సబియా బేగం వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. 2014నుంచి 2019వరకు చైర్‌పర్సన్‌గా ఉండగా.. తాజాగా మరోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. భైంసాలో నాలుగోసారి.. ఎంఐఎం మున్సిపాలిటీని దక్కించుకుంది. 1995నుంచి 2000 వరకు, 2000-2005వరకు జాబీర్‌ అహ్మద్‌ చైర్మన్‌గా ఉండగా.. తాజాగా వరుసగా రెండు సార్లు సబియా బేగం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేస్తున్నారు. 


logo