శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Jan 28, 2020 , 00:37:22

కేజీబీవీల్లో ‘బయోమెట్రిక్‌'

కేజీబీవీల్లో ‘బయోమెట్రిక్‌'

సారంగాపూర్‌: కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది హాజరును ఇకనుంచి బయోమెట్రిక్‌ విధానం ద్వారా నమోదు చేయనున్నారు. జిల్లాలో 18 కస్తూర్బా విద్యాలయా లు ఉండగా, 13 విద్యాలయాల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బయోమెట్రిక్‌ యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చా యి. కేజీబీవీల్లో 192 మంది సీఆర్‌టీలు, పీజీ సీఆర్‌టీలు, 168 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బయోమెట్రిక్‌ ద్వారా ఉపాధ్యాయుల హాజరుశాతం పెంచ డం, పారదర్శకత మరింత మెరుగుపర్చడం ముఖ్యఉద్దేశం. సమయపాలనతోపాటు జవాబుదారీ తనం పెంపొందించడం, విద్యాప్రమాణాలు మెరుగుపర్చడం లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.

హాజరు తీరు ఇలా...

కేజీబీవీల్లో పనిచేసే స్పెషల్‌ ఆఫీసర్స్‌ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు రిజిస్టర్‌లోనే ఇప్పటివరకూ హాజరు నమోదు చేస్తున్నారు. ఇకనుంచి బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేస్తారు. అందరూ నిర్ణీతసమయం ఉదయం తొమ్మిది గంటల్లోగా విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆలస్యంగా విధులకు రావడం, గడువుకు ముందే ఇంటికి వెళ్లడం ఇక నుంచి ఉండదు. మరోవైపు చేసిన పనిని కచ్చితంగా గుర్తించేందుకు, మానిటరింగ్‌ చేసే సమయంలో పనితీరు అంచనా వేసేందుకు, తద్వారా విద్యాబోధనలో మార్పులు వచ్చేందుకు బయోమెట్రిక్‌ విధానం ఎంతో ప్రయోజనకరమని అధికారులు భావిస్తున్నారు.

విద్యాలయాలకు చేరిన బయోమెట్రిక్‌ పరికరాలు

జిల్లాలోని 18 కస్తూర్బా విద్యాలయాలు ఉండగా, 13 కేజీబీవీలకు అధికారులు బయోమెట్రిక్‌ పరికరాలను ఇప్పటికే పంపిణీ చేశారు. ప్రస్తుతం విద్యార్థుల ఆధార్‌ నమోదు కొనసాగుతున్నది. దాదాపు అన్ని విద్యాలయాల్లో ఆధార్‌ ఫిడింగ్‌ పూర్తి కానుండగా, ఉద్యోగుల, సిబ్బంది నమోదు అనంతరం త్వరలో బయోమెట్రిక్‌ విధానం అమలుచేయనున్నారు.

బయోమెట్రిక్‌ అమలు చేస్తున్న కేజీబీవీలు ఇవే...

జిల్లాలో 13 కేజీబీవీల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు కానుంది. ఇందులో దిలావర్‌పూర్‌, లక్ష్మణచాంద, భైంసా, నిర్మల్‌ అర్బన్‌, నిర్మల్‌ రూరల్‌, జామ్‌, కడెం, ముథోల్‌, నర్సాపూర్‌(జీ), తానూర్‌, కుభీర్‌, కుంటాల, సోన్‌ త్వరలో ప్రారంభం కానున్నాయి. మామడ, పెంబి, ఖానాపూర్‌, లోకేశ్వరం, దస్తురాబాద్‌ కేజీబీవీల్లో బయోమెట్రిక్‌ ప్రారంభం కావడం లేదు.  logo