బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Jan 27, 2020 ,

పరోక్ష ఎన్నిక నేడే

పరోక్ష ఎన్నిక నేడే

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు ప్రకటించగా నేడు కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీల్లో నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. నేటి నుంచి కొత్త పాలకవర్గాలు అమల్లోకి రానున్నాయి. జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీ లుండగా మొత్తం 80వార్డులు ఉన్నాయి. ఇందు లో ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా.. 75వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలను శనివారం ప్రకటించారు. దీంతో ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సభ్యులతో ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేశారు. ముందుగా కొత్తగా గెలుపొందిన సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం పరోక్ష పద్ధతిలో చేతులెత్తి మున్సిపల్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఇందుకోసం మున్సిపాలిటీల వారీగా ఏర్పాట్లు చేశారు. 

నిర్మల్‌ మున్సిపాలిటీలో 42వార్డులుండగా.. 30వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. దీంతో నిర్మల్‌ మున్సిపల్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అధిరోహించనున్నారు. నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా గండ్రత్‌ ఈశ్వర్‌ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన చైర్మన్‌గా ఎన్నిక కావడం లాంఛనప్రాయమే. 

భైంసాలో..

భైంసాలో 26వార్డులుండగా.. 15వార్డులను ఎంఐఎం దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సబియాబేగంను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖానాపూర్‌లో 12వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌కు 5, కాంగ్రెస్‌కు 5, బీజేపీ, స్వతంత్రులు ఒక్కో వార్డు దక్కగా.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పుర పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో పుర పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 

నిర్మల్‌ మున్సిపాలిటీలో 2014లో బీఎస్పీ దక్కించుకోగా.. ఆ తర్వాత వారంతా కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. నిర్మల్‌ నుంచి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు  కోనప్పతో పాటు బీఎస్‌ఎల్‌పీ టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలీనం చేశారు. దీంతో నిర్మల్‌ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉండగా.. రెండోసారి కూడా నిర్మల్‌ మున్సిపాలిటీలో అధికార పీఠాన్ని అధిరోహిస్తుంది. భైంసాలో వరుసగా నాల్గోసారి ఎంఐఎం మున్సిపాల్టీలో పాగా వేసింది. గండ్రత్‌ ఈశ్వర్‌ 2000-2005 వరకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేయగా.. తాజాగా రెండోసారి నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని అధిరోహిస్తున్నారు. భైంసా మున్సిపాలిటీలో సబియాబేగం రెండోసారి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతున్నారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీలో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ నుంచి చైర్‌పర్సన్‌ ఎన్నికవుతున్నారు. 

ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం

కలెక్టర్‌ పర్యవేక్షణలో పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తుండగా.. మూడు మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారులు పాలకవర్గాల సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. భైంసాలో జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, నిర్మల్‌లో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, ఖానాపూర్‌లో ఎంపీడీవో మల్లేశం ప్రత్యేకాధికారులుండగా.. వీరి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. చైర్‌పర్సన్‌ ఎన్నుకున్నాకే.. వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగకుంటే వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా నిలిచిపోతుంది. సోమవారం ఏవైనా అనివార్య కారణాలతో పరోక్ష ఎన్నికలు నిలిచిపోతే మరుసటి రోజైన మంగళవారం నిర్వహిస్తారు. మంగళవారం కూడా వాయిదా పడితే ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తారు. తర్వాత ఎన్నికల కమిషన్‌ ఇచ్చే తేదీన ఎన్నిక ఉంటుంది. 


logo