గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 27, 2020 ,

భక్తజన నాగోబా

భక్తజన నాగోబా

ఇంద్రవెల్లి :  కెస్లాపూర్‌ నాగోబా జాతర భక్తజనంతో కిక్కిరిసింది. ఆదివారం నాగోబాను దర్శించుకోవడం కోసం జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. గంటల తరబడి బారులుతీరి నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పెర్సపేన్‌ దేవతకు ప్రత్యేక పూజలు

నాగోబా ఆలయం వెనుకభాగంలో ఉన్న పెర్సపేన్‌ దేవతకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీజలంతో దేవతకు జలాభిషేకం చేసి సంప్రదాయ పూజలు చేశారు. నైవేద్యాలను సమర్పించి గిరిజనులు తమ మొక్కులను తీర్చుకున్నారు.  సహపంక్తి భోజనాలు చేశారు.

మహిళల ఆధ్వర్యంలో 

బాన్‌ దేవతకు పూజలు

మెస్రం వంశీయు మహిళల ఆధ్వర్యంలో బాన్‌ దేవతకు సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవాడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మహిళలతోపాటు బేటింగ్‌ చేసిన కొత్త కోడళ్లను బాన్‌దేవత (సతిదేవత)వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కొత్తకోడళ్లు మర్రిచెట్ల వద్ద ఉన్న పురాతన బావి వద్దకు చేరుకొని మట్టికుండల్లో నీరు తీసుకొని బాన్‌దేవతల వద్దకు చేరుకున్నారు. మట్టిగోలలు చేసి బాన్‌దేవతలను తయారు చేశారు. 

గోవాడ్‌లో కొత్తకోడళ్లకు చరిత్రపై అవగాహన 

నాగోబా ఆలయంలో బేటింగ్‌ నిర్వహించిన కొత్తకోడళ్లకు నాగోబా చరిత్రతోపాటు మెస్రం వంశీయుల చరిత్ర, సంప్రదాయలపై అవగాహన కల్పించారు. గోవాడ్‌లో తుకోడోజీ కిక్రి వాయిస్తూ పాటల రూపంలో అవగాహన కల్పించారు. 

మెస్రం వంశీయులు ఆధ్వర్యంలో అన్నదానం

నాగోబా జాతర సందర్భంగా నాగోబాను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల కోసం మెస్రం వంశీయులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. నాగోబాను దర్శించుకున్న భక్తులు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు.

నాగోబాను దర్శించుకున్న ప్రముఖులు

కెస్లాపూర్‌ నాగోబా జాతరను పురస్కరించుకొని డీఎఫ్‌వో ప్రభాకర్‌రెడ్డితోపాటు ఉట్నూర్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరావ్‌, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, డాక్టర్‌ సుమలత, కెస్లాపూర్‌ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు 

ఎస్పీ విష్ణువారియర్‌ను సన్మానించిన 

మెస్రం వంశీయులు

కెస్లాపూర్‌ నాగోబా జాతరను పురస్కరించుకొని ఎస్పీ విష్ణువారియర్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి నాగోబాను దర్శించుకున్నారు.  నాగోబా చరిత్రను విన్నారు. విష్ణువారియర్‌, కుటుంబ సభ్యులకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నీటి వసతి కల్పించారు. పోలీసులు భారీ బందోబస్త్తు ఏర్పాట్లు చేశారు. 


logo