బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 26, 2020 , 02:10:25

ఎన్నిక ఏదైనా.. గులాబీదే గెలుపు

ఎన్నిక ఏదైనా.. గులాబీదే గెలుపు
  • -అసెంబ్లీ నుంచి పురపోరు వరకు కారుదే జోరు
  • -ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గులాబీ గుత్తాధిపత్యం
  • -పకడ్బందీ వ్యూహరచన
  • -ప్రభుత్వ పథకాలే అస్ర్తాలు.. అల్లోల మంత్రాంగం
  • -11మున్సిపాలిటీలకు పది చోట్ల టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
  • -ఒక్క భైంసాలో మాత్రమే ఎంఐఎంకు దక్కిన పురపీఠం

ఎన్నికలు ఏవైనా  గులాబీదే గెలుపు అన్నట్లుగా సాగుతున్నది టీఆర్‌ఎస్‌ విజయాల పరంపర అసెంబ్లీ నుంచి పురపోరు వరకు వరుస విజయాలతో కారు దూసుకుపోతున్నది. అన్ని ఎన్నికల్లోనూ గులాబీదే గుత్తాధిపత్యం కొనసాగుతుండగా తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీచింది. పకడ్బందీ వ్యూహరచన, మంత్రి అల్లోల, ఎమ్మెల్యేల కృషితో కారు జోరు కొనసాగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఏజెండాగా ముందుకు సాగగా  పురపోరులోనూ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.. ఉమ్మడి జిల్లాలో 11మున్సిపాలిటీలకుగాను  10చోట్ల పురపీఠాలను దక్కించుకుంది. ఒక్క భైంసాలో మాత్రమే ఎంఐఎం గెలువగా.. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేదు.
     -నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12మున్సిపాలిటీలు ఉండగా.. మందమర్రి మున్సిపాలిటీలో 1/70యాక్టు ఉండడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతోంది. మిగతా 11మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించగా.. 10మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుభి మోగించింది. ఒక్క భైంసాలో మాత్రమే ఎంఐఎం మరోసారి పురపీఠాన్ని దక్కించుకుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా.. ఆరు చోట్ల పుర పీఠాలను దక్కించుకుంది. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌లో ఒక్కోటి ఉండగా.. వీటిని కూడా కైవసం చేసుకుంది. నిర్మల్‌ జిల్లాలో ఒకటి గెలువగా, మరో దాంట్లో ఒక్క అడుగు దూరంలో ఉంది. మంచిర్యాల జిల్లా పరిధిలోని మంచిర్యాల, లక్సెట్టిపేట్‌, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూర్‌ అయిదు మున్సిపాలిటీల్లో పూర్తి మెజారిటీ వచ్చింది. నస్పూర్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తుండటంతో.. ఆరు మున్సిపాలిటీలు దక్కుతుండటంతో జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసినట్లే. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. నిర్మల్‌ జిల్లాలోని నిర్మల్‌ కేంద్రం మున్సిపాలిటీని పూర్తి మెజారిటీతో దక్కించుకోగా.. ఖానాపూర్‌లో ఒక్క అడుగు దూరంలో ఉంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చెరో అయిదు వార్డులు గెలుచుకోగా.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి మద్దతు కీలకంకాగా.. ఆయన టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తానికి 11మున్సిపాలిటీలకుగాను.. 10చోట్ల టీఆర్‌ఎస్‌ పురపీఠాలను దక్కించుకుంటోంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అసలు బోణీ కూడా చేసే పరిస్థితి లేదు. భైంసాలో ఎంఐఎం 15స్థానాలు గెలువగా.. పురపీఠాన్ని నాలుగోసారి దక్కించుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 309వార్డులు ఉండగా.. అయిదింటా మూడొంతుల వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ మొత్తం 182వార్డులను టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా.. కాంగ్రెస్‌ కేవలం 51వార్డులకే పరిమితమైంది. బీజేపీ కేవలం 25 వార్డుల్లోనే గెలిచింది. ఎంఐఎం 22వార్డులను దక్కించుకోగా.. ఇతర పార్టీల నుంచి నాలుగు చోట్ల గెలిచింది. సీపీఐ నస్పూర్‌లో రెండు వార్డులు గెలుచుకోగా.. క్యాతన్‌పల్లిలో ఒక్క వార్డు గెలిచింది. ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి నస్పూర్‌లో ఒక వార్డులో గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ 15శాతం వార్డుల్లోనే విజయం సాధించగా.. బీజేపీ 7 నుంచి 8శాతం వార్డుల్లోనే గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ మరోసారి గుత్తాధిపత్యాన్ని చాటుకుంది.
తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అయిదు మున్సిపాలిటీల్లో బీజేపీ కేవలం 22వార్డులనే గెలుచుకుంది. నిర్మల్‌, ఖానాపూర్‌లో ఒక్కో స్థానంతో బోణీ చేయగా.. భైంసాలో 9, ఆదిలాబాద్‌లో 11 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగజ్‌నగర్‌లో ఒక్క వార్డు కూడా బీజేపీ గెలవలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓట్లు వచ్చినప్పటికి అవి కేవలం నరేంద్రమోది ప్రభావంతో వచ్చినట్లు తాజాగా మరోసారి స్పష్టమైంది. ఇక మంచిర్యాల జిల్లాలో నస్పూర్‌ మున్సిపాలిటీలో మూడు స్థానాలు గెలువగా.. మంచిర్యాల, లక్షెట్టిపేట్‌, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, కాగజ్‌నగర్‌లో అసలు బోణీ చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన మేర స్థానాలను దక్కించుకోలేదు. మంచిర్యాలలో 14, నిర్మల్‌లో 7, కాగజ్‌నగర్‌లో 6, నస్పూర్‌లో 6, ఆదిలాబాద్‌లో 5, లక్షెట్టిపేట్‌లో 5, ఖానాపూర్‌లో 5, బెల్లంపల్లిలో 2, క్యాతన్‌పెల్లిలో 1స్థానాలను దక్కించుకోగా.. చెన్నూర్‌, భైంసాలో అసలు బోణీ చేయలేదు. ఇక కమ్యూనిస్టులు (సీపీఐ) నస్పూర్‌లో 2, క్యాతన్‌పెల్లిలో ఒక స్థానం గెలువగా..అసలు తెలుగుదేశం పోటీయే చేయలేదు.


 కేటీఆర్‌ దిశా నిర్దేశం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అన్ని తామై మున్సిపల్‌ ఎన్నికల్లో ముందుకెళ్లారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా వినియోగించారు. విపక్షాలు చేసిన దుష్పచారాలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుండగా.. మున్సిపల్‌ ప్రచారంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఇంటింటికీ తిరిగి లబ్దిదారులను కలిశారు. అభ్యర్థులు రెండు, మూడుసార్లు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. మున్సిపాలిటీల వారిగా, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిలను వేయగా.. వారు స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీల వారీగా నాయకులతో కలిసి సమన్వయం చేసుకున్నారు. దీంతో మరోసారి టీఆర్‌ఎస్‌కు భారీ విజయం దక్కింది.logo
>>>>>>