శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Jan 26, 2020 , 02:09:43

సరిలేరు కారుకెవ్వరు!

సరిలేరు కారుకెవ్వరు! నిర్మల్‌ మున్సిపాలిటీలో గులాబీదే గుత్తాధిపత్యం 42వార్డులకుగాను.. 30వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖానాపూర్‌లో హంగ్‌.. స్వతంత్ర కౌన్సిలరే కీలకం  భైంసా మున్సిపాలిటీ మరోసారి ఎంఐఎం కైవసం 12చోట్ల కాంగ్రెస్‌, 11చోట్ల బీజేపీ
అభ్యర్థుల విజయం

నిర్మల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. శనివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టగా మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడయ్యాయి.  నిర్మల్‌  మున్సిపాలిటీలో నాలుగింటా మూడొంతుల వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకోగా.. మున్సిపల్‌ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంది. ఖానాపూర్‌లో హంగ్‌ ఏర్పడగా ఇక్కడ స్వతంత్ర కౌన్సిలరు మద్దతు కీలకంగా మారింది. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం మరోసారి కైవసం చేసుకుంది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ నిలిచింది.  జిల్లాలో మొత్తం 80వార్డులకు గాను  35చోట్ల టీఆర్‌ఎస్‌, 17చోట్ల ఎంఐఎం, 12చోట్ల కాంగ్రెస్‌, 11 చోట్ల బీజేపీ గెలుపొందాయి.  ఐదు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: నిర్మల్‌లో కారు జోరు కొనసాగింది.. ఎన్నికలు ఏవైనా.. గెలుపు గులాబీదే అన్నట్లుగా.. నిర్మల్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ గులాబీదే గుత్తాధిపత్యం కొనసాగింది. నిర్మల్‌ జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీలు ఉండగా.. వీటికి ఎన్నికలు నిర్వహించారు. తాజాగా ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించారు. జిల్లాలో 80వార్డులకుగాను ఐదు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 75వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఐదు వార్డుల్లో నిర్మల్‌లో రెండు వార్డులు టీఆర్‌ఎస్‌, భైంసాలో మూడు వార్డులు ఎంఐఎం ఏకగ్రీవంగా దక్కించుకుంది. మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 80వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 35వార్డులను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలువగా.. రెండో స్థానంలో ఎంఐఎం 17వార్డులను గెలుచుకుంది. 12చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలువగా.. 11చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఐదు వార్డుల్లో స్వతంత్రులు, రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా.. తర్వాత స్థానంలో ఎంఐఎం నిలిచింది. నిర్మల్‌ పుర పీఠం టీఆర్‌ఎస్‌ సునాయాసంగా దక్కించుకోగా.. ఖానాపూర్‌లో హంగ్‌ ఏర్పడింది.

ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారింది. భైంసాలో మరోసారి ఎంఐఎం పుర పీఠాన్ని కైవసం చేసుకుంది.
నిర్మల్‌ మున్సిపాలిటీలో తిరుగులేని మెజారిటీతో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయాన్ని దక్కించుకుంది. 42వార్డులకుగాను.. 30వార్డులను గులాబీ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. 42వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా.. వీటిని టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 40వార్డులకు ఎన్నికలు జరుగగా.. ఇందులోనూ 28వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. వార్డు నెంబరు 10, 33లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. మరో 28 వార్డుల్లో విజయం సాధించడంతో మొత్తం 30 వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది.  దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ తన ఖాతాల్లో వేసుకుంది. నిర్మల్‌లో కాంగ్రెస్‌ కేవలం ఏడు స్థానాలకే పరిమితం కాగా.. బీజేపీ ఒక వార్డులో గెలిచి బోణీ మాత్రమే చేసింది. ఎంఐఎం రెండు స్థానాల్లో గెలుపొందగా.. మరో రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. గండ్రత్‌ ఈశ్వర్‌ను మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో దించగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌గా ఆయన ఎన్నిక కానున్నారు.

భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం మరోసారి కైవసం చేసుకుంది. ఇక్కడ 26వార్డులుండగా.. మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిని ఎంఐఎం ఏకగ్రీవంగా దక్కించుకోగా.. తాజాగా 23వార్డులకు జరిగిన ఎన్నికల్లో మరో 12 వార్డులను ఎంఐఎం గెలుచుకుంది. దీంతో మొత్తం 15 వార్డులను దక్కించుకుంది. మరోసారి పుర పీఠాన్ని ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 9వార్డుల్లో విజయం సాధించగా.. మరో రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. భైంసాలో ఎంఐఎం నాల్గోసారి పుర పీఠాన్ని దక్కించుకోనుంది. ఎంఐఎం నుంచి షబియా బేగం చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉండగా ఆమె రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. logo