ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 26, 2020 , 02:08:39

కౌంటింగ్‌ నుంచి క్యాంపునకు..

 కౌంటింగ్‌ నుంచి క్యాంపునకు..
  • -జోరందుకున్న క్యాంపు రాజకీయాలు
  • -కౌన్సిలర్లను తరలించిన పార్టీల నేతలు
  • -కౌంటింగ్‌ నుంచి శిబిరానికి చేరిన వైనం
  • -రేపు నేరుగా మున్సిపాలిటీలకే రాక..


నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవటంతో.. ఇక క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉండగా.. నిర్మల్‌లో టీఆర్‌ఎస్‌, భైంసాలో ఎంఐఎం గెలువగా, ఖానాపూర్‌లో హంగ్‌ వచ్చింది. దీంతో మూడు చోట్ల కూడా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. పుర పోరులో గెలుపొందిన కౌన్సిలర్లను క్యాంపుల్లోకి తీసుకెళ్లారు. ఈ నెల 27న (సోమవారం) మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక ఉండగా.. పరోక్ష విధానంలో నిర్వహిస్తారు. కౌన్సిలర్లు చేతులెత్తి తమ మద్దతును తెలియజేస్తారు. శనివారం రోజున కౌంటింగ్‌ పూర్తయ్యాక.. ఆయా పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. నిర్మల్‌లో 42వార్డులకుగాను.. 30వార్డులను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. దీంతో ఇక్కడ స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇక్కడ ఎలాంటి సమస్య లేకపోగా.. సోమవారం రోజున మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌ను ఎన్నుకోనున్నారు. భైంసాలో 26వార్డులకుగాను 15వార్డులను ఎంఐఎం గెలుచుకుంది. దీంతో సబియాబేగంను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా సోమవారం ఎన్నుకోనున్నారు. మరోవైపు ఖానాపూర్‌లో 12వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 5, బీజేపీ 1, స్వతంత్రులు ఒక్కో చోట విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తొంటి శ్రీనివాస్‌ మద్దతు కీలకంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారనే ప్రచారం ఉండగా.. సోమవారం రోజున స్పష్టత రానుంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. కౌంటింగ్‌ పూర్తయ్యాక క్యాంపులకు వెళ్లిన కౌన్సిలర్లు సోమవారం రోజున నేరుగా మున్సిపల్‌ కార్యాలయాలకు చేరుకోనున్నారు. సోమవారం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. మొత్తానికి గత 15రోజులుగా ప్రచారంలో బిజీగా ఉన్న అభ్యర్థులు.. తాజాగా కౌంటింగ్‌ పూర్తవటంతో ఊపిరి పీల్చుకున్నారు. పుర పోరులో విజయం సాధించిన అభ్యర్థులు ఆనందంలో ఉండగా.. ఓడిపోయిన వారు విషాదంలో ఉన్నారు. తమ ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ మైనస్‌ అయిందనే లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. పరోక్ష ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. భైంసా, నిర్మల్‌లో స్పష్టత ఉండగా.. ఖానాపూర్‌పై కాస్తా ఉత్కంఠ నెలకొంది.logo