మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 25, 2020 , 01:07:21

నమో నాగోబా..

నమో నాగోబా..

మహారణ్యం జనసంద్రమైంది. ఆదిలాబాద్‌ జిల్లా కెస్లాపూర్‌ పరిసరాలు నాగోబా నామస్మరణలో ప్రతిధ్వనించాయి. మౌని అమావాస్య ముగిసే ఘడియల్లో వి‘శేష’ పూజలతో గిరిజన జాతర ప్రారంభమైంది. పవిత్ర గంగాజలంతో నాలుగు రోజులుగా మర్రిచెట్ల వద్ద బస చేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్‌లోని పురాతన ఆలయం నుంచి నాగోబా విగ్రహాన్ని తీసుకొని ఊరేగింపుగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. వీరికి మెస్రం వంశ పటేళ్లు సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.30 గంటలకు ఆలయంలో నాగోబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. 22 కితలకు చెందిన మెస్రం వంశ మహిళలకు పెద్దల చేతులమీదుగా కుండలను పంపిణీ చేశారు. ఆదివాసీ మహిళలు కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి పాముల పుట్టలు, బౌలదేవతలను తయారు చేశారు. రాత్రి ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. ఐదు రోజులపాటు కొనసాగనున్న జాతరలో.. చివరిరోజైన 29వ తేదీన ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కెస్లాపూర్‌ నాగోబా జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఐదు రోజులపాటు కొనసాగే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సంప్రదాయ ప్రత్యేక పూజలతో మహాపూజలకు శ్రీకారం చుట్టారు. పవిత్ర గంగాజలంతో నాలుగు రోజులుగా మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు ముందుగా కెస్లాపూర్‌ గ్రామంలోని పురాతన (మురాడి) నాగోబా ఆలయానికి చేరుకొని సంప్రదాయ పూజలు నిర్వహించారు. నాగోబా విగ్రహంతోపాటు వెలిగించిన దీపాలను వెదురుబుట్టలో ఉంచి నాగోబా ఆలయానికి బయలుదేరారు. కెస్లాపూర్‌ గ్రామం నుంచి పురాతన నాగోబా విగ్రహంతో వచ్చిన మెస్రం వంశ పటేళ్లకు సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయం ముందున్న మైసమ్మ దేవతకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నాగోబా ఆలయంలోకి ప్రవేశించారు. పురాతన నాగోబా విగ్రహాలతోపాటు నాగోబాదేవత, సతీదేవతలు, బాన్‌దేవతలకు సంప్రదాయ పూజలు చేశారు. గ్రామం నుంచి తీసుకొచ్చిన పురాతన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలోని నాగోబా విగ్రహం వద్ద ఉంచారు. నాగోబా ఆలయం పక్కన బసచేసిన మెస్రం వంశ పెద్దలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆలయం వెనుకభాగంలో ఉన్న భాన్‌దేవతలతోపాటు పెర్సపేన్‌దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి నాగోబా ఆలయంలోకి వచ్చారు. ఆలయం వెనుక ఉంచిన మట్టికుండలను 22 కితలకు చెందిన మెస్రం వంశ మహిళలకు పెద్దల చేతులమీదుగా పంపిణీ చేశారు. కుండలను తీసుకొని మహిళలు సమీపంలోని కోనేరుకు చేరుకున్నారు. మెస్రం వంశ అల్లుళ్లు కోనేరు నీటిని తోడి కుండల్లో నింపారు. నీటి కుండలను మహిళలు తలపై పెట్టుకొని ఒకరి వెనుక ఒకరు నడుస్తూ నాగోబా ఆలయానికి చేరుకున్నారు.

ఆలయంలోని పాత పాముల పుట్టలను అల్లుళ్లు తవ్వి తొలగించారు. మహిళలు తెచ్చిన నీటితో అల్లుళ్లు బురదమట్టి చేశారు. మహిళలందరూ కలిసి ఆ మట్టితో పాముల పుట్టలను తయారు చేసి, అదే మట్టితో మరికొంత మహిళలు నాగోబా ఆలయంలో బౌలదేవతను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. బౌలదేవత ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలకు, మెస్రం వంశీయులకు నాగోబా చరిత్రను తుకోడోజీ కిక్రి వాయిస్తూ పాటల ద్వారా వివరించారు. సాయంత్రం మర్రిచెట్ల నుంచి మెస్రం వంశీయులు ఎడ్లబండ్లతో ఆలయానికి చేరుకొని మహిళలకు గోవాడ్‌లో ప్రవేశం కల్పించారు. గోవాడ్‌ చుట్టూ ఎడ్లబండ్లను వదిలి ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేసుకొని బసచేస్తున్నారు. గోవాడ్‌లో ప్రవేశించిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకొని మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని సామూహికంగా తయారు చేస్తున్నారు. మెస్రం వంశీయుల సంప్రదాయం ప్రకారం మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్‌ నుంచి వెలిగించిన కాగడాలను చేతిలోపట్టుకొని సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయంలో మహాపూజలు నిర్వహించేటప్పుడు ఇతరులను లోనికి అనుమతించలేదు. 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మెస్రం వంశీయులే నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల మహాపూజల అనంతరం మహాపూలకు వచ్చిన అతిథులతోపాటు ఇతరులకు నాగోబాకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించారు.
-ఇంద్రవెల్లి విలేకరిlogo
>>>>>>