ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Jan 25, 2020 , 01:05:48

‘పుర’ ఫలితాలు నేడే!

‘పుర’ ఫలితాలు నేడే!
  • - కాసేపట్లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • - కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు
  • - ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
  • - రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు
  • - మధ్యాహ్నం వరకు ఫలితాలు ప్రకటించే అవకాశం
  • - మూడు మున్సిపాలిటీల్లో కౌంటింగ్‌..టెన్షన్‌..

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరికొద్ది సేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 80 వార్డులు ఉండగా, ఐదు ఏకగ్రీవమయ్యాయి. 75 వార్డుల్లో పోలింగ్‌ నిర్వహించగా మొత్తం 91, 598 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభంకానుండగా, మధ్యాహ్నం వరకు ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు.. రెండు రౌండ్లలోనే పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ కోసం పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- నిర్మల్‌/నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మరికొద్ది సేపట్లో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీలుండగా.. వీటికి ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 80వార్డులుండగా.. వీటిలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్‌లో రెండు వార్డులను టీఆర్‌ఎస్‌, భైంసాలో మూడు వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. దీంతో 75వార్డులకే ఎన్నికలు నిర్వహించగా.. వీటి ఓట్లను నేడు (శనివారం) లెక్కింపు చేసి.. ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుండగా.. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.

మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు ..

మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుండగా.. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం నియమించిన సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది కూడా కౌంటింగ్‌ కేంద్రానికి ఉదయం 6.30గంటలకే చేరుకోవాలని జేసీ ఎ.భాస్కర్‌రావు ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే టేబుళ్లు, మిక్సింగ్‌ డ్రమ్ములు, కంప్యూటర్లు, ఇతర వస్తువులు సిద్ధం చేశారు. తాగునీరు, అల్పాహారం, భోజన వసతులు ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ నిర్వహించినప్పటికీ.. ఎక్కడా జాప్యం లేకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతి మున్సిపాలిటీలోనూ  రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా.. అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు ప్రకటించాలనే ఎన్నికల సంఘం ఆదేశాలతో.. నిర్మల్‌ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కూడా రెండు రౌండ్లలోనే పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌లో 42వార్డులకుగాను.. రెండు వార్డులు ఏకగ్రీవంకాగా.. 40వార్డులకు పోలింగ్‌ జరిగింది. ముందు 14టేబుళ్లు ఏర్పాటు చేయాలని, మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని భావించారు. ఈసీ ఆదేశాలతో మరో ఆరు టేబుళ్లను పెంచడంతో.. 20టేబుళ్లపై ఓట్లను కౌంటింగ్‌ చేస్తుండడంతో.. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. భైంసాలో 26వార్డులకుగాను.. మూడు వార్డులు ఏకగ్రీవమగా.. 23వార్డులకు పోలింగ్‌ జరిగింది. 12టేబుళ్లు ఏర్పాటు చేయగా.. రెండు రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఖానాపూర్‌లో 12వార్డులుండగా.. ఆరు టేబుళ్లు ఏర్పాటు చేయగా.. రెండు రౌండ్లలోనే ఓట్ల కౌంటింగ్‌ పూర్తి కానుంది.

కౌంటింగ్‌కు బందోబస్తు

జిల్లాలో 75వార్డుల్లో 1,37,988మంది ఓటర్లు ఉండగా.. 91,598మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్‌లో 85,171 మందికిగాను.. 55,628 మంది, భైంసాలో 37,083మందికిగాను 23,994 మంది, ఖానాపూర్‌లో 15,734మందికిగాను 11,976 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు 75వార్డుల్లో.. 91,598ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌ కోసం మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేయగా..కేంద్రం వద్ద తనిఖీలు చేపడతారు. కౌంటింగ్‌ పాస్‌ ఉన్న వారికే లోపలికి అనుమతి ఇస్తారు. సెల్‌ఫోన్లు, లైటర్‌, తుపాకి, అగ్గిపెట్టే, వాటర్‌ బాటిల్‌, రాళ్లు, ఇంకుబాటిల్‌, కర్రలు, కెమెరాలు, కత్తి, స్క్రూ డ్రైవర్లు, మొలలు లాంటి వస్తువులు కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించరు. ఒక డీఎస్పీ, ఏడుగురు సీఐలు, 16మంది ఎస్సైలు, 20మంది ఏఎస్సైలు, 81 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆరుగురు మహిళా పోలీసులను బందోబస్తు కో సం వినియోగిస్తున్నారు. రెండు పా ర్టీల ఏఆర్‌ పోలీసులు (ఒక్కో దాంట్లో 20మంది చొప్పున) కౌంటింగ్‌ ప్రాం తంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కోసం  సూపర్‌ వైజర్లు 43 మంది, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు 86 మంది, మైక్రో ఆబ్జ ర్వర్లు13 మందిని నియమించారు.  

బరిలో 296 మంది

జిల్లాలో మొత్తం 296 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో గెలిచేదెవరో.. ఓడేదెవరో.. మరికొద్ది గం టల్లో తేలిపోనుంది. భైంసాలో 23 వార్డుల్లో 88 మంది, నిర్మల్‌లో 40 వార్డుల్లో 148మంది, ఖానాపూర్‌లో 12వార్డులకు 60మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు రాత్రం తా మళ్లీ ఓట్ల లెక్కల్లో మునిగి తేలా రు. శుక్రవారం అమవాస్య కాగా.. ఇంకా తెలవారదేమంటూ.. రాత్రం తా జాగరణ చేశారు. తమ సన్నిహితులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూర్చొని లెక్కలు వేసుకున్నారు. గెలుస్తామా.. లేదా.. గెలిస్తే.. ఎన్ని ఓట్లతో గెలుస్తామని.. ఎక్కడ ప్లస్‌ ఉంది.. ఎక్కడ మైనస్‌ ఉంది.. అంటూ లెక్కలతో కుస్తీ పట్టారు. మరోవైపు జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు మున్సిపల్‌ అభ్యర్థులను పిలిచి సమావేశాలు నిర్వహిస్తుండగా.. మరికొందరు ఇప్పటికే క్యాంపుల్లోకి వెళ్లిపోయారని సమాచారం.logo